అర్హులందరికీ రుణాలు ఇవ్వాలి
ఒంగోలు సబర్బన్: రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రుణాలు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లకు సూచించారు. ప్రకాశం భవనంలో గురువారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు రుణాల మంజూరులో కేవలం లక్ష్యాలకు పరిమితం కాకుండా అన్ని రకాల దరఖాస్తులను పరిశీలించాలన్నారు. జిల్లాలో పశుపోషణ, మత్స్య, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకోసం బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపార వేత్త రావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని సూచించారు. లీడ్‌బ్యాంక్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ డి.రమేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, అనుబంధ రంగాలకు గత వార్షిక ప్రణాళికలో 91.99 శాతం రుణాలు ఇచ్చామన్నారు. అందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 88.72 శాతం రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి 4 రెట్లు అధికంగా రుణాలు ఇచ్చామన్నారు. డీఆర్‌డీఏ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 83 శాతం రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు 71 శాతం రుణాలు ఇచ్చామని చెప్పగా.. కలెక్టర్ స్పందిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరుకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీల దరఖాస్తుదారులకు సాంకేతిక కారణాను చూపిస్తూ రుణాల మంజూరులో జాప్యం చేయవద్దన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎఫ్‌ఐడీడీ రోహిత అగర్వాల్, నాబార్డు డీడీఎం రవికుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాసరావుతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.