ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ●
● నలుగురికి తీవ్ర గాయాలు
టంగుటూరు: రాంగ్ రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన ఇట్టా ఆదర్శి కుటుంబ సభ్యులు వీరేంద్రబాబు, హాసిని, దీపిక, తన్మయి తేజ ఒంగోలు నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చే సరికి రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటో బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
సింగరాయకొండ: గుర్తు తెలియని వ్యక్తి(40) విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరేసుకుని మృతి చెందిన సంఘటన శుక్రవారం పాత కలికవాయకు వెళ్లే రోడ్డులో పాల ఫ్యాక్టరీ వెనుక వైపు చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కథనం ప్రకారం.. మృతుడి శరీరంపై తెలుపు గడులతో కూడిన నిండుచేతుల లేత నీలం రంగు చొక్కా, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసిన వారు 9121102135, 9121102136కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందకూరు ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ●
Comments
Please login to add a commentAdd a comment