బాధితులకు భరోసా ఇవ్వాలి
దర్శి: సమస్యలు చెప్పుకొనేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరముందని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన దర్శితోపాటు ముండ్లమూరు, తాళ్లూరు పోలీస్‌స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ల ఆవరణలో పరిశుభ్రత, గదులు, రిసెప్షన్ కౌంటర్లు, మహిళా సహాయ కేంద్రాలతోపాటు దర్శిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. శాంతి భద్రతలు కాపాడటంతోపాటు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని, వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాత్రి వేళ గస్తీని ముమ్మరం చేయాలన్నారు. చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు శక్తి యాప్, సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాలు, సీసీ కెమేరాలు, హెల్మెట్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం స్థానిక సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎస్పీ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సీఐ రామారావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్సైలు మురళీ, నాగరాజు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచన దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి స్థల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment