
గోవిందుని రథోత్సవం
కనుల పండువగా
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గోవిందుడి రథోత్సవం భక్తుల జయజయ ధ్వానాల మధ్య కనుల పండువగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణతో వెలుగొండ క్షేత్రం మారుమోగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ వెలుగొండ క్షేత్రంలో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మహిళలు ఉత్సాహంతో శ్రీవారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ముందుగా స్వామివారికి వేద పండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవానికి ఉభయదాతలుగా గార్లదిన్నె గ్రామస్తులు, దేవస్థాన కమిటీ సభ్యులు వ్యవహరించారు. గజోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భజంత్రీల సన్నాయి భక్తులను అలరించింది. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, ఉత్సవ సేవా కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి పర్యవేక్షించారు. ఎస్సై రాజ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రథోత్సవాన్ని పురష్కరించుకుని పలు సత్రాల్లో భక్తులకు అన్న సంతర్పణ చేశారు. తిరునాళ్ల సందర్భంగా శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చెంచులక్ష్మి, బ్రహ్మంగారి నాటకం, మహిళల కోలాట ప్రదర్శన, బొల్లావుల ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గోవిందుని రథోత్సవం

గోవిందుని రథోత్సవం