
శ్రీశైలానికి పెరిగిన భక్తుల రద్దీ
పెద్దదోర్నాల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులతో రెండు రోజులుగా పెద్దదోర్నాల మండల కేంద్రంలో రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డులో రాత్రివేళ ప్రయాణాలకు అటవీశాఖ అనుమతులిచ్చింది. ఈ నెల 27వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరం నల్లమల ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి జీవన్‌కుమార్ తెలిపారు.
అధిక సంఖ్యలో తరలివస్తున్న కన్నడిగులు...
కర్ణాటక నుంచి తమ ఇంటి ఆడపడుచు బ్రమరాంబదేవి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించేందుకు కర్ణాటక వాసులు పలు వాహనాలలో శ్రీశైలానికి భారీగా తరలివెళ్తున్నారు. ఉగాది పర్వదినాన్ని కన్నడిగులు శ్రీశైలంలో నిర్వహించడం ఆనవాయితీ కావడంతో రెండు రోజుల నుంచే భారీఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. శివుని చిత్రపటాలతో అలంకరించిన ప్రత్యేక వాహనాలతో భక్తులు వస్తున్నారు. అధిక శాతం భక్తులు కాలినడకన నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పలువురు భక్తులు రైళ్ల ద్వారా మార్కాపురం చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవస్థాన కమిటీ అనేక ఏర్పాట్లు చేసింది. ఉగాది బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైలంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, శివసంకల్పం, స్వస్తిపుణ్యాహం, చండీశ్వరపూజ, కంకనపూజ, కంకనధారణ, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, చండీహోమం తదితర కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవం, శయన ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండటంతో పండుగకు ముందే రద్దీ అధికంగా ఉంది.
ఉగాది సందర్భంగా భారీగా తరలివెళ్తున్న భక్తులు భక్తుల సౌకర్యార్థం రాత్రివేళ ప్రయాణాలకు అనుమతినిచ్చిన అటవీశాఖ ఈ నెల 27వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ వరకు అనుమతులు

శ్రీశైలానికి పెరిగిన భక్తుల రద్దీ