● 2022–23 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారించాలి ● కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలో అంధుల డిమాండ్
ఒంగోలు వన్‌టౌన్: 2022–23 విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని నిరుద్యోగ విజువల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1.3 పద్ధతిలో కొన్ని పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు మూడేళ్లు కాలయాపన చేశారన్నారు. టైపిస్టు పోస్టుకు 1.3 కాకుండా 1.4 పద్ధతిలో మరొకరని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ జి.అర్చన చేర్చారని, అదేమని అడిగితే జేసీ ఆదేశాల మేరకు చేర్చినట్లు తెలిపారన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ వైఖరిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడేళ్లు గడిచిపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. దివ్యాంగులు పొందాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా 1:3 పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్.అనిల్ కుమార్, ఇతర విజువల్లీ చాలెంజ్డ్ నిరుద్యోగులు పాల్గొన్నారు.