అడుగంటుతున్న ప్రాణాలకు..
నల్లమల వన్యప్రాణుల భూతల స్వర్గం. వైవిధ్యభరితమైన జంతువులకు కేరాఫ్ అడ్రస్. అరుదైన జంతు, వృక్ష సంపదకు నిలయం. జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో దాహార్తి తీర్చేందుకు దృష్టి సారించారు. ఎండాకాలం అటవీ ప్రాంతంలో ఉంచే నీటి చలమలు, నీటి మడుగుల్లో జలాలు అడుగంటిపోతాయి. దీంతో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల వైపు పరుగులు తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తాగు నీటి వనరులను అందుబాటులో ఉంచేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న నీటి కుంటల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 150 సాసర్ పిట్లలో నీటిని నింపుతున్నారు.
మార్కాపురం: వేసవి కాలం మొదలైపోయింది. ఇప్పుడే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులే ఎండవేడికి ఇబ్బంది పడుతున్న పరిస్ధితుల్లో వన్యప్రాణుల సంగతి సరేసరి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖాధికారులు వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో మార్కాపురం పరిధిలో 900 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. పెద్ద పులలతో పాటు వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, నెమళ్లు తదితర వన్యప్రాణులకు నల్లమల అటవీ ప్రాంతం నెలవుగా ఉంది. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్‌లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే అటవీ ప్రాంతంలో ఉండే నీటి చలమలు, నీటి మడుగుల్లో జలాలు అడుగంటి పోతాయి. తాగునీటి కోసం దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు రహదారిపైకి, గ్రామాల వైపు వన్యప్రాణులు వెళ్తున్నాయి. ఆక్రమంలో అవి వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. మరికొన్ని రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలిరాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నారు. మార్చి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వన్యప్రాణులకు నీటి వనరులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు దృష్టి సారించారు. నీటి వనరుల కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది అటవీ ప్రాంతంలో 150 సాసర్‌పిట్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతున్నారు. వీటితో పాటు సహజసిద్ధంగా 275 నుంచి 300 నీటి కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా 40 నీటి కుంటలు ఏర్పాటు చేశారు. 20 సోలార్ పంప్‌సెట్ల ద్వారా నీటిని నింపుతున్నారు. దీంతో పెద్ద పులులు, చిరుతలు, దుప్పులు ఇతర వన్యప్రాణులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. సీసీ కెమెరాల ద్వారా వీటి కదలికలను పరిశీలిస్తున్నారు.
నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు వేసవిలో అడుగంటుతున్న నీటి వనరులు నీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి జనావాసాల వైపు వెళ్లకుండా ఉండేలా చర్యలు అందుబాటులోకి 150 సాసర్‌పిట్లు 40 కుంటల్లో ప్రత్యేకంగా నీటి సౌకర్యం 20 సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటు
జలజీవం !