ఉప పోరులో పచ్చకుట్ర | - | Sakshi
Sakshi News home page

ఉప పోరులో పచ్చకుట్ర

Published Tue, Mar 25 2025 1:57 AM | Last Updated on Tue, Mar 25 2025 2:18 AM

ఉప పోరులో పచ్చకుట్ర

ఉప పోరులో పచ్చకుట్ర

యర్రగొండపాలెం: మండల ప్రజా పరిషత్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కక్కుర్తి రాజకీయాలకు తెరతీసింది. నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలో వారికి బలం లేకున్నా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలంలో బలం లేకున్నా ఎంపీపీ పదవి కోసం కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ నెల 27వ తేదీ జరగాల్సిన త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలను జరగకుండా ఉండేలా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మండలంలో టీడీపీ వర్గానికి ఒక్క ఎంపీటీసీ సభ్యుడు కూడా లేకున్నా ఆ మండలంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులపై అరాచకాలకు పాల్పడుతున్నారు. మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో తమదే పైచేయి అనిపించుకోవాలన్న దురుద్దేశంతో పోలీసులను ఉసిగొల్పుతున్నారు. మండలంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదన్న ప్రచారం జరుగుతోంది.

ఎంపీటీసీ సభ్యులపై అక్రమ కేసులు:

త్రిపురాంతకం ఎంపీపీ స్థానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి కూటమి నాయకుడు పోలీసుల సహకారంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ సభ్యులపై వేటు వేశాడు. మండలంలో ఉన్న మొత్తం 18 ఎంపీటీసీ సభ్యులకుగాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది, ఒకరు ఇండిపెండెంట్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ మండలంలో టీడీపీ వర్గానికి చెందినవారు అప్పట్లో ఏ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దూపాడు ఎంపీటీసీ సభ్యుడు కోట్ల సుబ్బారెడ్డి ఎంపీపీగా కొనసాగారు. అనారోగ్య పరిస్థితుల వలన ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ స్థానంలో అప్పటి వరకు వైస్‌ ఎంపీపీగా కొనసాగుతున్న త్రిపురాంతకంలోని అంబేడ్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గొట్టిముక్కల రిబకమ్మ తాత్కాలికంగా ఎంపీపీ పీఠాన్ని అధిష్టించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పనులను చక్కబెట్టుకోవటానికి నియోజకవర్గ టీడీపీ నాయకుడు ఆమెకు ప్రలోభాలు పెట్టి ఆమె మెడలో పచ్చకండువా కప్పాడు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఎంపీపీ స్థానానికి ఎన్నిక అనివార్యంగా మారింది. అందుకు పూర్తిస్థాయిలో బలం ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ స్థానానికి పోటీ చేయటానికి సిద్ధమయ్యారు. మాజీ ఎంపీపీ, వైఎస్సార్‌ సీపీ మండల నాయకుడు ఆళ్ల ఆంజనేయరెడ్డి ఉమ్మడివరం ఎంపీటీసీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన వెంట 10 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. మిగిలిన ఏడుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడికి మద్దతు ఇస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ఎంపికై నా తమ పనులు చక్కబెట్టుకోవటానికి వీలు పడదని భావించిన సదరు నేత పరోక్షంగా రెండో వర్గానికి మద్దతు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో బలం ఉన్న ఆంజనేయరెడ్డిని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలన్న కుట్రతో ఆయన ముఖ్య అనుచరుడిగా ఉంటున్న ఒకరిని రెచ్చకొట్టారు. తన గుప్పెట్లో ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యురాలిని రెండో వర్గానికి మద్దతు ఇచ్చేలా తెరవెనుక యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే మెజార్టీ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 27వ తేదీన జరిగే మండల పరిషత్‌ సమావేశంలో ఉన్న సభ్యులకంటే ఒకరిద్దరు అదనంగా పాల్గొనాలి. లేకుంటే ఆ మరుసటి రోజుకు సమావేశం వాయిదా వేస్తారు. అప్పటికీ నిబంధనల ప్రకారం ఆ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరుకాలేకపోతే తిరిగి ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఎంపీపీ పీఠంపై వైస్‌ ఎంపీపీ కొనసాగుతారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకుడు నీచ రాజకీయాలకు తెరతీశాడు. ఎంపీపీగా పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి తన ముఖ్య అనుచరుడిని కులంపేరుతో దూషించినట్లు, హత్యచేయటానికి ప్రయత్నించినట్లు పోలీసులతో కేసు నమోదు చేయించాడు. పోలీసులు కూడా కూటమి నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఆంజనేయరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణ జరపకుండా ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌.సుబ్బారావును అరెస్ట్‌ చేశారు. ఈ చర్యతో వైఎస్సార్‌ సీపీలో ఉన్న బలమైన వర్గం బలహీనపడింది.

పుల్లలచెరువులోనూ ఇదే తంతు..

పైచేయి కోసం కక్కుర్తి రాజకీయాలు బలం లేకున్నా తెర వెనుక కుయుక్తులు ఒక్క సభ్యుడు లేని త్రిపురాంతకం మండలంలో అరాచకాలు కూటమి నాయకుడి ఆదేశాలే పోలీసులకు శిరోధార్యం పుల్లలచెరువు మండలంలోనూ ఇదే తీరు..

పుల్లలచెరువు మండల ఎంపీపీ స్థానానికి కూడా ఎన్నిక జరగాల్సి ఉంది. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 11 స్థానాలు వైఎస్సార్‌ సీపీ, 4 స్థానాలు టీడీపీ పక్షాన ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు మందా లాజర్‌ ఎంపీపీగా కొనసాగుతూ అనివార్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో వైస్‌ ఎంపీపీగా ఉన్న కందుల వెంకటయ్య ఎంపీపీ పీఠాన్ని అధిష్టించారు. కూటమి నాయకుడు ఈయనతోపాటు మరొకరి మెడలో పచ్చకండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నాడు. అయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆ మండలంలో మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ కూడా నీచ రాజకీయం నడిపేందుకు సిద్ధమవుతున్నారు. యర్రగొండపాలెం మండల ప్రజా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో ప్రస్తుతం 10 వైఎస్సార్‌ సీపీ, 8 టీడీపీ వర్గాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కో ఆప్షన్‌ సభ్యుడిగా కొనసాగుతున్న ఎస్‌.విజయకుమార్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ స్థానంలో ఆయన కుటుంబంలోని ఒకరిని కో ఆప్షన్‌ సభ్యుడిగా నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అవకాశం కల్పించారు. టీడీపీకి బలం లేకున్నా ఆ స్థానం కూడా తమకే దక్కేలా కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement