దూకేయమంటారా!
సమస్య తీరుస్తారా..
ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుండగా ప్రకాశం భవనం ఎక్కి ఒకరు నిరసన వ్యక్తం చేశారు. మరొకరు అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం సందర్భంగా తన ఇల్లు కొట్టేస్తున్నారంటూ అక్కడే సంతపేటలోని భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే దూకుతామంటూ బెదిరింపులకు దిగారు. వారిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో మాట్లాడి పరిష్కరిస్తామని ఒంగోలు టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసులు నచ్చజెప్పి కిందకు దింపేలా చర్యలు చేపట్టారు.
● ఒంగోలు నగరానికి చెందిన ఆసోది శంకర రెడ్డి గతంలో కూరగాయల మార్కెట్లో షాపు నిర్వహించుకునేవాడు. అయితే అతనికి కొంతమంది ద్వారా ప్రాణహాని ఉందని ఎప్పటి నుంచో తుపాకీ లైసెన్స్ కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు గన్ లైసెన్స్ ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారంటూ ప్రకాశం భవన్ ఎక్కాడు. సకాలంలో గమనించిన ఒంగోలు టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు అతనికి నచ్చచెప్పి కిందకు దిగేలా ఏర్పాటు చేశారు.
● అగ్రహారం గేటు సమీపంలో రోడ్డు పక్కనే నివాసం ఉంటున్న తోటకూర శ్రీకాంత్ రైల్వే అండర్ పాస్ వల్ల తన ఇల్లు పడగొడతారని, అందుకు నిరసనగా సంతపేటలోని ఒక భవనం ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి భవనం మీద నుంచి కిందకు దింపారు.
ప్రకాశం భవనం ఎక్కి ఒకరు...మిద్దెక్కి మరొకరు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన సమస్యలు పరిష్కరించకపోతే దూకుతామంటూ బెదిరింపులు ఇద్దరినీ కిందకు దింపి పోలీస్ స్టేషన్లకు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment