పోటీలో ఉన్న అభ్యర్థిని అరెస్టు చేయడం దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి
ఒంగోలు టౌన్: ఎంపీపీగా పోటీలో ఉన్న అభ్యర్థిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. జిల్లా కారాగారంలో ఉన్న త్రిపురాంతకం ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయ రెడ్డిని సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 27వ తేదీ ఎన్నికలు పెట్టుకొని ఎంపీటీసీని తీసుకొచ్చి అరెస్టు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. ఆంజనేయరెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి అని, రేపు జరిగే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉందని చెప్పారు. ఆయన మీద ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటుగా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టడం సమర్ధనీయం కాదని, ఇలాంటి చర్యలను సభ్య సమాజం హర్షించదని చెప్పారు. ఇలాంటి తప్పుడు పనులు తాత్కాలికంగా నడవవచ్చు కానీ ప్రజలు అంగీకరించరన్నారు. ఈ విషయంపై ప్రజలు యావగించుకుంటున్నారని తెలిపారు. ప్రజా స్వామ్యానికి ఇది ప్రమాదకరమని, దీనిపై ప్రజలు తిరగబడతారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా జైలులో పెట్టినప్పటికీ పార్టీ మొత్తం ఆంజనేయ రెడ్డికి అండగా ఉంటుందని తెలిపారు. చెవిరెడ్డి వెంట రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment