ఒంగోలు టౌన్:
స్థానిక ఎన్నికల్లో గెలిచే సత్తా లేకపోవడం వల్లనే వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఆంజనేయ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మంగళవారం జిల్లా జైలులో ఉన్న ఎంపీటీసీ ఆంజనేయ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ఎంపీపీ కోసం డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలను రంగంలోకి దించి హైడ్రామా సృష్టించి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఒక వ్యక్తిని అడ్డుకున్నాడని చెప్పి ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆంజనేయ రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటుగా గొడ్డలితో దాడికి దిగినట్లు 307 కేసు పెట్టారని తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే గొడ్డలి కానీ, చిన్న గాయం కానీ లేదని, ఫిర్యాది గాయపడితే ఆస్పత్రిలో చేరడం కూడా జరగలేదని చెప్పారు. ఎస్సీ అట్రాసిటీ కేసులో డీఎస్పీ విచారణ చేయాలని, చుట్టుపక్కల వారిని విచారించాలని ఇతర నియమ నిబంధనలను పాటించకుండా కక్షపూరితంగా అరెస్టు చేశారన్నారు. ఆంజనేయ రెడ్డిని అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెట్టి మరుసటి రోజు అరెస్టు చేసినట్లు చూపడం దుర్మార్గం అన్నారు. కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి 18 మంది ఎంపీటీసీలు ఉంటే టీడీపీ అభ్యర్థి ఎంపీపీ అయ్యే ఛాన్స్ లేదని, అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక టీడీపీ ఇన్‌చార్జితో కలిసి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను రంగంలోకి దించి అక్రమ అరెస్టులతో ప్రజా స్వామ్యాన్ని హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను తీసుకెళ్లి దాచిపెట్టి ఎంపీపీ కావాలనుకోవడం అమానుషం అన్నారు. ఆంజనేయరెడ్డి విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి