
మోటూరి స్ఫూర్తితో మహిళా సమస్యలపై పోరాటం
ఒంగోలు టౌన్: ఏపీలో మొట్టమొదటి మహిళా మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేసి తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన మోటూరి ఉదయం స్ఫూర్తితో మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. మోటూరి ఉదయం 23వ వర్ధంతిని స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితమైన కాలంలోనే మోటూరి ఉదయం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన ఆమె.. సీ్త్ర, పురుష సమానత్వం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ఉదయం స్ఫూర్తితో మహిళల కోసం ఒంగోలులో ఉచిత న్యాయ సలహా కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఐద్వా జిల్లా నాయకురాలు జి.రాజ్యలక్ష్మి తెలిపారు. ఆమె మనవరాలైన డా.ఉదయిని సహకారంతో బేతూన్ నర్సింగ్ హోంలో ప్రతి నెలా మూడో శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఉదయం ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బి.పెద్ద గోవిందమ్మ, ఎన్.మాలతి, కె.రాజేశ్వరి, కె.రాణి తదితరులు పాల్గొన్నారు.