
నేడు ఫ్యాప్టో నిరసన జయప్రదం చేయండి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వద్ద జిల్లా ఫ్యాప్టో శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో వందలాది సంఖ్యలో జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్ పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వి.జి.కీర్తి, వై.శ్రీనివాసులు, పి.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, ససరెండర్ లీవ్స్, సీపీఎస్ ఉపాధ్యాయుల అరియర్స్ వంటి మొండి బకాయిల సాధన, విద్యారంగ సమస్యల సాధన కోసం నిరసన తెలుపుతున్నామని జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటరావు, ఫ్యాఫ్టో జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్ కుమార్ తెలిపారు.
ప్రధాన డిమాండ్‌లు ఇవీ..
● సీపీఎస్, జీపీఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
● 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలి.
● 12 వ పీఆర్సీకి కమిషన్ ను వెంటనే నియమించాలి. ఈ లోగా 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలి. 3 డీఏలను ప్రకటించాలి.
● 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవు బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తక్షణమే చెల్లించాలి.
● 70 ఏళ్లు దాటిన పెన్షనర్స్‌కు 10 శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ను అమలు చేయాలి
● పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి.
● ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ కు సంబంధించి 72, 73, 74 జి.ఓ లను అమలు చేయాలి.
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ నేడు
పీసీపల్లి: మండల పరిధిలోని దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధిగా అనంత్ అంబానీ తదితరులు వస్తున్న నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జేసీ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి సభా వేదిక వద్ద జిల్లా అధికారులతో సమావేశమై ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న వీవీఐపీలకు, వీఐపీలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ దామోదర్, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వాస్తవాలు బయటపెట్టండి
ఒంగోలు టౌన్: పాస్టర్ అనుమానాస్పద మృతిపై నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని, వాస్తవాలను బయట పెట్టాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఫ్లై ఓవర్ నుంచి ట్రంకు రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై వాస్తవాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పారు. పాస్టర్ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, దళిత క్రిస్టియన్ల మీద దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనారిటీ క్రైస్తవ మతాల ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతోన్మాదులు పెట్రేగి పోతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పాస్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు ఫ్యాప్టో నిరసన జయప్రదం చేయండి