
ఎయిడెడ్ పాఠశాలల సమాచారం ఇవ్వండి
ఒంగోలు సిటీ: జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 94 ఎయిడెడ్ పాఠశాలల పూర్తి సమాచారం డాక్యుమెంట్లతో సహా 12 పేజీలు మూడు సెట్లు డీఈఓ కార్యాలయానికి ఇవ్వాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకటరావు, ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలు, పాఠశాల గుర్తింపు, పాఠశాల కమిటీ వివరాలు, పాఠశాల మూడేళ్ల ఆడిట్ రిపోర్ట్ పాఠశాల వసతుల అన్ని వివరాలతో యాజమాన్యాలు బుక్‌లెట్ తయారుచేసి పంపాలని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపినట్లు చెప్పారు.
నేటి నుంచి ఎస్‌ఎస్‌సీ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
ఒంగోలు సిటీ: ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ ఒంగోలులోని డీఆర్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో గురువారం నుంచి ప్రారంభమవుతుందని డీఈఓ ఎ.కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ సబ్జెక్టుకు సంబంధించిన మూల్యాంకనం 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. సోషల్ సబ్జెక్టునకు సంబంధించిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి శుక్రవారం ఉదయం 8 గంటలకు స్పాట్ వాల్యూయేషన్ క్యాంపునకు హాజరుకావాల్సిందిగా కోరారు.
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చీమకుర్తి క్రీడాకారులు
చీమకుర్తి: రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు చీమకుర్తి క్రీడాకారులు ఎంపికయ్యారని కోచ్ కరిచేటి వెంకట్ బుధవారం తెలిపారు. చీమకుర్తి గెలాక్సీ స్పోర్ట్స్ క్లబ్‌కు చెందిన ఆరికాటి సూర్యతేజ, గూండా వెంకట సుకుమార్ ఎంపికయ్యారన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 9 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ పోటీల్లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్‌తో పాటు వారి తల్లిదండ్రులు అభినందించారు.
9లోపు సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
ఒంగోలు సిటీ: జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 9వ తేదీ లోపల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ ఎ.కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించామన్నారు. ఈ జాబితాలు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్ www.prakasamschooledu.com లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలను అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉంటే జత చేయాలని, సంబంధిత అధికారి ధ్రువీకరణతో సమర్పించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేస్తారన్నారు.