
లక్ష్యాల మేరకు రుణాలివ్వాలి
ఒంగోలు సబర్బన్: బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆర్థిక తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, రెడ్డి, క్షత్రియ, కమ్మ, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన వివిధ యూనిట్ల గ్రౌండింగ్ పురోగతిపై సమీక్షించి పలు సలహాలు, సూచనలు చేశారు. జిల్లాలో వీరికి సంబంధించి 1,864 యూనిట్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను వివిధ బ్యాంకులకు పంపడం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ నెల 9వ తేదీలోపు సుమారు వెయ్యి యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 11వ తేదీ జరిగే మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి వేడుకల్లో సంబంధిత లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు ఉత్తర్వులిచ్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతిబ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎం రమేష్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా