
వేసవిలో చలచల్లగా..
బేస్తవారిపేట: వేసవి ప్రారంభమై ఎండతీవ్రత, ఉక్కపోత పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లబడటంతో పశ్చిమ ప్రకాశం ప్రజలు సేదతీరారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. బేస్తవారిపేట మండలంలోని జెన్నివారిపల్లెలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఐదు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు కోత దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. దాదాపు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. మూడు రేకుల షెడ్లకు రేకులు ఎగిరి కిందపడ్డాయి.
మార్కాపురంలో వర్షం...
మార్కాపురం/కొనకనమిట్ల: పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో అకస్మాత్తుగా వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. వేసవిలో వర్షం పడటంతో ప్రజలు బయటకు వచ్చి వర్షంలో తడుస్తూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. వారం రోజులుగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమవుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ ఎండ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వర్షం కురిసి చల్లటి గాలులు వీచాయి. సుమారు 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. అదే సమయంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లోని పలు గ్రామాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
చిత్తడిగా మారిన కనిగిరి రోడ్లు...
కనిగిరి రూరల్/హనుమంతునిపాడు: కనిగిరిలో గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసి వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షం నీటితో పట్టణంలోని ప్రధాన, శివారు ప్రాంతాల్లోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. కొద్దిపాటి వర్షానికే పట్టణంలోని రోడ్లపై నీళ్లు నిలవడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు. హనుమంతునిపాడు మండలంలోనూ చిరుజల్లులు కురిసాయి. మండల కేంద్రంతో పాటు వేములపాడు, గాయంవారిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, హాజీపురం, వెంగపల్లి, తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు నిమ్మతోటల్లో పిందె, పూత రాలిపోయింది. కోతకోసిన రాగి పంట కూడా కొంత దెబ్బతింటుందని రైతులు తెలిపారు.

వేసవిలో చలచల్లగా..

వేసవిలో చలచల్లగా..

వేసవిలో చలచల్లగా..