
బరితెగించిన తెలుగు తమ్ముళ్లు
జరుగుమల్లి(సింగరాయకొండ): అధికార అండగా తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. మట్టి కోసం ఏకంగా 48 ఎకరాల ఆయకట్టు ఉన్న నేతివారికుంట కట్టను ధ్వంసం చేశారు. జరుగుమల్లి పంచాయతీలోని పంగులూరివారిపాలెంలోని నేతివారికుంటను చింతలపాలెం గ్రామానికి చెందిన పచ్చతమ్ముళ్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం ఏం చేయలేక మిన్నకుండాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..పంగులూరివారిపాలెం గ్రామ పరిధిలో ఉన్న నేతివారికుంటకు 48 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కుంటను గతంలో ఐటీసీ కంపెనీ వారు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కుంట కట్టలను పటిష్టం చేయడంతో పాటు అభివృద్ధి చేశారు. కానీ గురువారం చింతలపాలెం గ్రామానికి చెందిన పచ్చతమ్ముళ్లు తమ పొలాలకు మట్టి కావాలని ఎటువంటి అనుమతులు లేకుండా నేతివారికుంట కట్టలను ధ్వంసం చేసి మట్టిని తరలించారు. దీంతో విషయం తెలిసి జరుగుమల్లి గ్రామ సర్పంచ్ కె.పున్నారావు, వైఎస్సార్ సీపీ నాయకులు పిన్నిక శ్రీనివాసులు గ్రామస్తులను వెంటబెట్టుకుని వెళ్లి జేసీబీనీ, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ లోగా కుంట కట్టలను ధ్వంసం చేస్తున్నారని పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వటంతో ఆర్‌ఐ స్రవంతి, వీఆర్‌ఓ చైతన్య, పంచాయతీ కార్యదర్శి విద్యుల్లతలు అక్కడికి చేరుకుని అక్రమరవాణాదారులను అడ్డుకున్నారు. అయితే తమ్ముళ్లు మాత్రం వీరిని లెక్కచేయకుండా కుంట కట్టను ధ్వంసం చేస్తాం..అవసరమైతే మళ్లీ ఎన్‌ఆర్‌జీఎస్ పథకం కింద కట్టను అభివృద్ధి చేస్తామని వారితో వాదులాటకు దిగారు. దీంతో అధికారులు, గ్రామస్తులు ససేమిరా అనడంతో చివరికి తమ్ముళ్లు కట్టను వదిలి కుంటలోని మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించారు. దీనిపై సర్పంచ్ పున్నారావు మాట్లాడుతూ తమ్ముళ్ల అక్రమ దందాపై రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మట్టి కోసం నేతివారికుంట కట్ట ధ్వంసం
అడ్డుకున్న గ్రామస్తులు, అధికారులు
కట్టను వదిలి చెరువులో తవ్వకాలు

బరితెగించిన తెలుగు తమ్ముళ్లు

బరితెగించిన తెలుగు తమ్ముళ్లు