
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జ్‌గా జేసీ
ఒంగోలు సబర్బన్: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జిగా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రోణంకి గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన గ్రంథాలయ సెస్సు బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న జేసీని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన గ్రంథాలయాల వ్యవహారాలను గోపాలకృష్ణకు ఆమె వివరించారు.