
ఏకేయూ పెన్ కాక్ సిలాట్ పురుషుల జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: నార్త్ బెంగళూరు యూనివర్శిటీలో ఈ నెలలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పెన్ కాక్ సిలాట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ పురుషుల జట్టును స్థానిక యూనివర్శిటీ ప్రాంగణంలో శుక్రవారం ఎంపిక చేశారు. జట్టులో కే ప్రేమ్‌కుమార్, కే సాయిరామ్, షేక్ అక్రం, ఎం.శివయ్య అనే నలుగురు క్రీడాకారులు స్థానం సంపాదించారు. పెన్ కాక్ సిలాట్ జట్టు ఎంపిక కార్యక్రమంలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీవరప్రసాద్, ఏకేయూ క్రీడాకారుల సెలక్షన్ కమిటీ సభ్యులు జి.సాయిసురేష్ పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను ఏకేయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు తదితరులు అభినందించారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
మార్కాపురం: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కళాశాల రోడ్డులో నూతనంగా ప్రారంభిస్తున్న ఓ షోరూమ్‌లో చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజమోహన్‌రావు కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణంలోని నాగులపుట్ట వీధిలో నివాసముండే గుర్రాల మహేష్(25) నూతనంగా ప్రారంభించనున్న వస్త్ర షోరూమ్‌లో చేరాడు. గురువారం రాత్రి పనిచేసిన అనంతరం సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం సిబ్బంది వచ్చి చూడగా మహేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
మైనింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
● మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మద్దిపాడు: మైనింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడదామని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో ఉన్న ఎస్‌ఈజెడ్ లో మంత్రి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. గ్రానైట్ శ్లాబుల కటింగ్, క్వార్ట్జ్ నుంచి బిల్డింగ్ మెటీరియల్ తయారీ యూనిట్లను స్థానిక ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1500కి పైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయని, సెజ్ లో 100కి పైగా ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ఇక్కడి అవకాశాలకు నిదర్శనమన్నారు. త్వరలోనే నూతన పాలసీతో మైనింగ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ఎగుమతితో ఆదాయం పెంచుకునే మార్గాలను మెరుగుపరుచుకుందామన్నారు. ఈ సందర్భంగా సెస్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గ్రోత్ సెంటర్ గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్, ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆళ్ల రవి, రాజేంద్ర సంత్వాల్, మహేష్, కె.రామ్మోహన్‌రావు, శివరాం, ఉదయ్, మద్దిపాడు టీడీపీ అధ్యక్షుడు జయంత్ బాబు పాల్గొన్నారు.