
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఒంగోలు సబర్బన్: ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా, వడగాడ్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్ సమీక్షించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, తదితర శాఖల అధికారులు వేసవిలో తాగునీటి సరఫరాపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు కూడా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్ వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు రక్షిత తాగునీటి పథకాలలోని ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేయించాలన్నారు.
వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేయాలి...
పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాడ్పులపై ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అధికంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ఆటో స్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, షామియానాలు వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎవరూ ఎండలో తిరగరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, క్యాప్‌లు వినియోగించాలన్నారు. ఒదులుగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలని, వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే గ్లూకోజ్ వంటివి ఇవ్వాలని, తడిగుడ్డతో తుడవాలని, తదుపరి మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డీపీఎం మాధురి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సూరిబాబు, ఐసీడీఎస్ పీడీ హేనసుజన, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, గ్రౌండ్ వాటర్ డీడీ విద్యాసాగర్, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలి
చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
కలెక్టర్ తమీమ్ అన్సారియా