
సమస్యలను పరిష్కరించేలా ఆలోచించాలి
ఒంగోలు సిటీ: వ్యవస్థాపక మనస్తత్వం పెంపొందించుకోవడం, సమాజంలో ఉండే సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ఆలోచించడం వలన పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ జిల్లా స్థాయి ప్రాజెక్టు ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉపాధి కల్పించే స్థాయికి చేరవచ్చన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఉద్యం స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మంది విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో నుంచి రెండు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. బేస్తవారిపేట బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌కు ప్రథమస్థానం, జంగంగుంట్ల జెడ్పీ పాఠశాల ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు డీఈఓ తెలిపారు. ఈ విద్యార్థులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. డీఈఓ కిరణ్‌కుమార్ మెమొంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి మర్రిబోయిన శ్రీను, ఏఎంఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్, పాఠశాల హెచ్‌ఎం జిల్లా జ్యూరీ మెంబర్స్ బి.తిరుపతయ్య, కె.కె.ఎస్ రవికాంత్, ఈఎండీపీ కోఆర్డినేటర్లు రమణకుమారి, నీలిమ పాల్గొన్నారు.