
● ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో యాజమాన్యాల దోపిడీ ● పోస్టు
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలు 140 ఉన్నాయి. వీటిల్లో 613 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు 40 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 205 మంది మిగులు టీచర్లు ఉన్నారు. అయితే 21 ఎయిడెడ్ పాఠశాలల్లో 74 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గత ఏడాది డిసెంబరులో ఆయా పాఠశాలల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడే తిరకాసు ఉంది. కేవలం పేపర్ ప్రకటనల్లో మాత్రమే పోస్టులు చూపించారు. లోలోపల మాత్రం ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి నుంచి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.15 నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని సమాచారం.
ఆన్‌లైన్ వద్దంటూ కోర్టుకి..
ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తే వారి ఇష్టానుసారంగా నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉంది. అదే ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తే కష్టంగా మారే అవకాశం ఉందని భావించిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు విడతల వారీగా కోర్టును ఆశ్రయించాయి. గతంలో 8 పాఠశాలలు, తాజాగా 13 పాఠశాలల యాజమాన్యాలు కోర్టుకెళ్లాయి. గిద్దలూరు సెయింట్ పాల్స్ ఎయిడెడ్ స్కూల్, హిందూ ఎయిడెడ్ (కొత్తపల్లి), చిత్తరంజన్ అరబిక్ పాఠశాల (కనిగిరి), వీసీఏ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (వెంకటరెడ్డి పల్లి), కేఎంఎయిడెడ్ ఉన్నత పాఠశాల (గుడిపాటి పల్లి), ఎబీఎం ఎయిడెడ్ హైస్కూల్ (ఒంగోలు), ముప్పవరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (జె.పంగులూరు), ఎమ్మెస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం (చీరాల) తదితర పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అలాగే తాజా 13 ఎయిడెడ్ పాఠశాలలు కోర్టుకెళ్లాయి.
ఎస్‌బీఎన్‌ఆర్ ఎయిడెడ్ పాఠశాల (కొమరోలు), సెయింట్ జాకబ్ ఎయిడెడ్ పాఠశాల (ముండ్లపాడు), హిందూ ఎయిడెడ్ పాఠశాల (గిద్దలూరు), శ్రీ శ్రీనివాస ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (రావిపాడు), శ్రీరంగరాజన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (కంభం), ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (రాజుపాలెం), అంబేడ్కర్ ఎయిడెడ్ ఓరియంటల్ పాఠశాల (కనిగిరి), జీఎస్‌ఎస్‌టీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల (కరేడు), లూథరన్ ఉన్నత పాఠశాల (తర్లుపాడు), ఏకే మెమోరియల్ రెసిడెన్సీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (చెరుకూరు), ప్రకాశం ఎయిడెడ్ పాఠశాల (అద్దంకి), ఏబీఎం ఎయిడెడ్ పాఠశాల (బేస్తవారిపేట), నీలం జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (చీరాల) ఎయిడెడ్ పాఠశాలలు కూడా తమ పాఠశాలల్లోని 38 పోస్టుల భర్తీకి ఇటీవల కోర్టుకు వెళ్లాయి.
మూతపడిన
ఎయిడెడ్ పాఠశాలలకు నోటీసులు
పిల్లలు లేక మూతపడిన ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు ఇస్తున్నారు. సింగరాయకొండ ఎస్‌వీ ఎయిడెడ్ స్కూల్, ఒంగోలులోని జగ్జీవన్‌రాం ఎయిడెడ్ యూపీ స్కూల్ 2021లో, దశరాజుపల్లి ఎయిడెడ్ పాఠశాలను 2015లో, ఒంగోలులోని సీతారామపురం ఎయిడెడ్ స్కూల్‌ను 2016లో, రాచవారిపాలెం ఎయిడెడ్ స్కూల్‌ను 2021లో, కనిగిరిలోని ఎబీఎం ఎయిడెడ్ స్కూల్‌ను 2021 లో మూసివేశారు. విచిత్రమేమంటే పిల్లలు లేక, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యి ఇలా ఏదో ఒక కారణంతో మూతపడిన ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు నోటీసులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు అవాక్కవుతున్నారు. అలాగే ఎయిడెడ్ స్కూల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండి, పిల్లలు లేని ఎయిడెడ్ స్కూల్స్‌కు నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.
ఆ పాఠశాలలకు నోటీసులెక్కడా..?
టీచర్లు ఉండి జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలకు అధికారులు నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. జిల్లాలో యర్రగొండపాలెంలోని డీఎంబీసీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు, దొనకొండ ఇందిరాగాంధీ ఓరియంటల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, మార్కాపురం ఎబీఎం హైస్కూల్‌లో ఐదుగురు, గిద్దలూరు వివేకానంద ఎయిడెడ్ హైస్కూల్‌లో ఐదుగురు, జీవీఎస్ ఎయిడెడ్ హైస్కూల్‌లో ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సమావేశం హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. వీటిల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
ఆదేశాలు అందిన వెంటనే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తాం
ఎయిడెడ్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఆన్‌లైన్ పరీక్ష వాయిదా వేశాం. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తాం.
– ఎ.కిరణ్‌కుమార్, డీఈఓ, ఒంగోలు