
వృత్తిపై ఆర్టీసీ కంట్రోలర్ నిబద్ధత
ఇంకొల్లు(చినగంజాం): ఓ ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ సురక్షితంగా అప్పగించి వృత్తిపై నిబద్ధత చాటుకున్నారు. వివరాలు.. గిద్దలూరు ప్రాంతంలో పంచాయతీ గుమస్తాగా విధులు నిర్వహించే జితేంద్రరెడ్డి ఆదివారం తన వ్యక్తిగత పనిపై ఒంగోలు నుంచి ఇంకొల్లుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఈ క్రమంలో బస్సులో తన బ్యాగు మరచిపోయారు. బ్యాగు పోగొట్టుకున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఇంకొల్లు బస్టాండ్‌లోని కంట్రోలర్ షేక్ బాబును సంప్రదించారు. అయితే అప్పటికే ఆయన ప్రయాణించిన బస్సు ఒంగోలుకు బయలుదేరింది. బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేసిన కంట్రోలర్.. బ్యాగును తిరిగి తెప్పించి జితేంద్రరెడ్డికి అప్పగించారు. బాధితుడితోపాటు ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు మోహన కృష్ణ తదితరులు కంట్రోలర్‌ను అభినందించారు.