
పాతాళగంగ కోసం పాట్లు
పుల్లలచెరువు: మండలంలో తాగునీరు, వ్యవసాయ బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. ప్రస్తుతం నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలో వ్యవసాయం పూర్తిగా భూగర్భజలాలపైనే ఆధారపడి ఉంది. వర్షపాతం తక్కువగా ఉండటంతో గ్రామాల్లోని చిన్న, పెద్ద చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. భూగర్భ జలాలు అడుగంటడంతో 1000 అడుగుల మేర బోర్లు వేస్తున్నప్పటికీ నీరు పడటం లేదు. ప్రధానంగా రైతులు మిర్చి, పత్తి, కంది, ఇతర వాణిజ్య, ఆరు తడి పంటలు సాగు చేస్తున్నారు. మిర్చి పంట సాగుచేసిన పొలాల్లో బోర్లలో నీరు రాకపోవడంతో కాపుకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తోంది. పంటలు ఎండిపోతూ ఒక పక్క, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చుక్క నీరు పడక మరోపక్క రైతులు అల్లాడిపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పశుసంపద ఎక్కువగా ఉంది. పశువులకు తాగునీటికి ఇబ్బంది కలుగుతోంది. పశుగ్రాసం ఉన్న ప్రాంతాల్లోని చిన్నచిన్న కుంటలు, చెరువులు ఒట్టిపోయాయి. దీంతో ఇంటి దగ్గరే పశువులకు తాగునీరు అందించాల్సి ఉంది.
తగ్గిన సాగు విస్తీర్ణం...
మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో 2024–25 ఖరీఫ్‌లో సాధారణ పంట విస్తీర్ణం 26,500 ఎకరాలు కాగా, 22,600 ఎకరాల్లోనే సాగేచేశారు. రబీలో 2,500 ఎకరాలు సాగుచేయాల్సి ఉండగా, కేవలం 1,530 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు.

పాతాళగంగ కోసం పాట్లు