
లక్ష్యాల మేరకు రుణాలు అందించాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా ఎస్‌సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్‌సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం అమలుపై ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఎస్‌సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని కలెక్టర్ కోరారు. ఎస్‌సీ పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల ఆర్థిక సాధికారతను పెంచి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఎస్‌సీ యాక్షన్ ప్లాన్ 2025–26ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. మొత్తం రూ.54.60 కోట్లతో జిల్లాకు 1,305 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో రూ.21.58 కోట్లు సబ్సిడీ కాగా రూ.30.29 కోట్లు బ్యాంకు రుణమని, మిగిలిన మొత్తం లబ్ధిదారులు కట్టాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా, మండలాల వారీగా రుణ లక్ష్యాలను నిర్దేశించారన్నారు. ఎస్‌సీ యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో సైట్ ఓపెన్ చేశారని, మే నెల 13వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఎల్‌డీఎం రమేష్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి బ్యాంకర్స్ సమావేశంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా