బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి

Apr 7 2025 10:20 AM | Updated on Apr 14 2025 12:49 AM

బౌద్ధ

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి

చీమకుర్తి: రాష్ట్రంలోని బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలని బౌద్ధ భిక్షువులు ఆకాంక్షించారు. జపాన్‌కు చెందిన బౌద్ధ భిక్షువు యూషీ, శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బోధిహీన్‌ ఆదివారం దొనకొండ మండలంలోని చందవరం బౌద్ధ స్థూపాన్ని సందర్శించి తిరిగి ఒంగోలు వెళ్తూ మార్గం మధ్యలో చీమకుర్తిలో ఆగి విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో, విలేకరులతో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 40 బౌద్ధ స్థూపాలున్నాయని, ఒక్కొక్క స్థూపం వద్ద ప్రతి పౌర్ణమి రోజు దీపోత్సవం చేస్తున్నామని చెప్పారు. అమలాపురం వద్ద ప్రభుత్వం రెండు లేదా మూడు ఎకరాల భూమి ఇస్తే బౌద్ధమత వ్యాప్తి కోసం శాంతి ప్రదేశం నిర్మించతలపెట్టినట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు బౌద్ధ మతం గురించి వారు ఉపదేశించారు.

పండుగ పూట విషాదం

నీటికుంటలో పడి బాలుడు మృతి

దొనకొండ: నీటికుంటలో పడి బాలుడు మృతి చెందడంతో పండుగ పూట విషాదం అలముకుంది. మండల కేంద్రమైన దొనకొండ పంచాయతీలోని గుట్టమీదపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై టి.త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుట్టమీదపల్లి గ్రామానికి చెందిన పిక్కిలి వెంకటేశ్వరరావు గొర్రెలు మేపుకుంటూ జీవిస్తుంటాడు. శ్రీరామనవమి పండుగ, ఆదివారం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడు పిక్కిలి తరుణ్‌ (13)ని తీసుకుని గొర్రెలు తోలుకుని పొలం వెళ్లాడు. నేను గొర్రెల దగ్గర ఉంటాను, నువ్వు వెళ్లి అన్నం తినిరా.. అని తండ్రికి కుమారుడు చెప్పగా, తండ్రి ఇంటికెళ్లి అన్నం తిని తిరిగి గొర్రెల వద్దకు వెళ్లాడు. అక్కడ కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల గాలించగా, రైతులు పంటలు పండించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలో శవమై కనిపించడంతో వెంకటేశ్వరరావు నిర్ఘాంతపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై త్యాగరాజు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె సంతానం కాగా, కుమారుడు తరుణ్‌ స్థానిక విశ్వభారతి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

రాజ్యాధికారం ద్వారానే హక్కులు

ఒంగోలు వన్‌టౌన్‌: దేశంలో మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం ద్వారా మాత్రమే వారి హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ అన్నారు. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. 75 సంవత్సరాల రాజ్యాంగం అమలులో సవాళ్లు అనే అంశంపై ఒంగోలు అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. విజయకుమార్‌ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల అమలు, పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ నాయకులు డాక్టర్‌ విద్యాసాగర్‌, సురేష్‌ పంతగాని, తదితరులు పాల్గొన్నారు.

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి 1
1/2

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి 2
2/2

బౌద్ధ స్థూపాలకు పూర్వవైభవం తీసుకురావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement