
గంజాయి ముఠా ఆటకట్టు
సింగరాయకొండ: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు యువకులను జాతీయ రహదారిపై టోల్‌గేట్ సమీపంలో టంగుటూరు వెళ్లే సర్వీసు రోడ్డులో అరెస్టు చేసినట్లు సీఐ సీహెచ్ హజరత్తయ్య తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ వెల్లడించారు. గుంటూరు పట్టణంలోని రాజాగారితోటకు చెందిన గాజుల రాజు, చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో నివసిస్తున్న కేవీబీ పురం మండలం అంజూరు గ్రామానికి చెందిన పల్లం కిరణ్, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా, పడువ మండలం ఛట్వ పంచాయతీ జీరా గ్రామానికి చెందిన భీమా ఖొరా, ఖాషూఖిని ముందుస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద 4.550 కేజీల గంజాయి లభ్యమైందని, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు.
డబ్బు కోసం గంజాయి వ్యాపారం
టంగుటూరు మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న గాజుల రాజు గంజాయికి బానిసయ్యాడు. ఒడిశాకు చెందిన భీమాఖొరా, ఖాషూఖి సాయంతో గంజాయి తెప్పించుకుని తాగుతూ చిన్నచిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో రాజుకు పరిచయస్తుడైన శ్రీకాళహస్తికి చెందిన కిరణ్ ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, మూడున్నర కేజీల గంజాయి ఇప్పించాలని కోరాడు. అయితే రాజు భీమాఖొరా ద్వారా నాలుగున్నర కేజీల గంజాయి తెప్పించాడు. ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టంగుటూరు టోల్‌గేట్ వద్దకు భీమాఖొరా, ఖాషూఖి గంజాయితో చేరుకున్నారు. అదే సమయానికి రాజు, కిరణ్ అక్కడికి వచ్చారు. గంజాయి ప్యాకెట్లను నిందితులు పరిశీలించే క్రమంలో పోలీసు జీపు రావడంతో నలుగురూ పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా గంజాయి ముఠాను చాకచక్యంగా అరెస్టు చేసిన సీఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, కానిస్టేబుళ్లు శ్రీను, ఎస్.వెంకటరావు, ఎంవి కృష్ణారావు, శ్రీను, సుబ్బారెడ్డి, మహేష్, నాగార్జున, జయరాం, రమేష్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారని సీఐ వివరించారు.
నలుగురు నిందితులు అరెస్టు
4.550 కేజీల గంజాయి, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సింగరాయకొండ సీఐ