
ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు బదిలీ
ఒంగోలు: స్థానిక జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు సోమవారం బదిలీ అయ్యారు. ఒకటో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి.అమ్మన్నరాజాను కర్నూలు జిల్లా నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేయగా ఆయన స్థానంలో అనంతపురం పోక్సో కోర్టు జడ్జి టి.రాజ్యలక్ష్మిని నియమించారు. ఒంగోలులో మూడో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి.రాములును గుంటూరు లేబర్ కోర్టు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కం ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బదిలీచేసి, ఆయన స్థానంలో మచిలీపట్నంలో 6వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎ.పూర్ణిమను నియమించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జొన్నల కొనుగోలుకు ఏర్పాట్లు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1న ఏపీ పౌర సరఫరాల సంస్థ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జిల్లాలో పండించిన సీ–43 మహేంద్ర రకం హైబ్రిడ్ జొన్నలను రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు వీఏఏలను సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం క్వింటా జొన్నలకు రూ.3,371 మద్దతు ధర ప్రకటించిందని వెల్లడించారు. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి జొన్నలు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
హమాలీలను రైతులే ఏర్పాటు చేసుకుంటే ఆ ఖర్చులను ప్రభుత్వం అదనంగా ఇస్తుందని, గోనె సంచులు, జొన్నల రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందని తెలిపారు. రైతులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతుందని పేర్కొన్నారు.
కబడ్డీ విన్నర్‌గా కరేడు జట్టు
కొత్తపట్నం: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా కొత్తపట్నంలో రెండు రోజులుగా నిర్వహించిన ప్రకాశం, బాపట్ల, తిరుపతి, నెల్లూరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీల్లో కరెడు జట్టు విజేతగా నిలిచింది. రాజుపాలెం జట్టు ద్వితీయ, కొండూరిపాలెం జట్టు మూడో బహుమతి, గుమ్మళ్లదిబ్బ జట్టు నాలుగో బహుమతి, అలగాయపాలెం జట్టు ఐదో బహుమతి గెలుపొందాయి. విజేతలకు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి సొంత నగదుతో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడా పోటీలతో ఐక్యతా భావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
మద్దతు ధర క్వింటాకు రూ.3371
జేసీ రోణంకి గోపాలకృష్ణ వెల్లడి

ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు బదిలీ