
14న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
రాచర్ల: నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 14వ తేదీ రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేల్లో పాల్గొనేవారు రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. విజేతలకు మొదటి నాలుగు బహుమతులు వరుసగా రూ.లక్ష, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 95056 81744, 79974 74026, 99120 32442ను సంప్రదించాలని సూచించారు.
వివాదాస్పద భూమిలో జాయింట్ సర్వే
కురిచేడు: కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కోసం రిలయన్స్ సంస్థకు కురిచేడు మండలంలోని గంగదొనకొండ రెవెన్యూ పరిధిలో భూ కేటాయింపుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా గురువారం సర్వే నిర్వహించాయి. కనిగిరి ఆర్డీఓ జి.కేశవర్ధన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ వినోద్‌కుమార్, సబ్ డీఎఫ్‌ఓ శ్రీనివాసరావు, రేంజ్ అధికారి బి.నరసింహారావు సమక్షంలో సర్వేయర్లు ఆ భూములను కొలతలు వేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. హద్దులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే దిశగా సమష్టిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వీఆర్వో హనుమంతురావు, ఇన్‌చార్జి సర్వేయర్ గోపి, గ్రామ సర్వేయర్లు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నాట్య మయూరాలకు గిన్నిస్ సర్టిఫికెట్లు
యర్రగొండపాలెం: భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా నాట్య ప్రదర్శనలో స్థానిక శ్రీవెంకటేశ్వర భరత నాట్య అకాడమీకి చెందిన చిన్నారులు మందుల సాయి ఆహ్లాదిత, తాళ్లపల్లి నాగబాల నందిని, తాళ్లపల్లి నాగబాల వైష్ణవి, ఆముదం సిరిచందన, పిండి తేజస్విని పాల్గొన్నారు. ఈ నాట్య ప్రదర్శనకు గిన్నిస్ రికార్డులో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ సర్టిఫికెట్లు, మెడల్స్‌ను గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు అందుకున్నారు. చిన్నారులను అకాడమీ నాట్య గురువు మందుల భారతి, వైస్ ఎంపీపీ ఆదిశేషు అభినందించారు.
విద్యుత్ డీఈ కార్యాలయ సీనియర్
అసిస్టెంట్ అదృశ్యం
● సూసైడ్ నోట్ రాయడంతో కలకలం
దర్శి(కురిచేడు): అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక దర్శి విద్యుత్ డీఈ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏకంగా సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి రాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు.. స్థానిక విద్యుత్ డీఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గూడపురెడ్డి రామకృష్ణారెడ్డి తన ఇంట్లో మరణ వాంగ్మూలంతోపాటు మరో కాగితంపై బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డుల వివరాలు, పాస్‌వర్డ్‌లు రాసిపెట్టి అదృశ్యమయ్యారు. నాలుగేళ్ల క్రితం హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన కందుల రాజశేఖరరెడ్డి వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పునకు ప్రాంసరీ నోట్లు, సంతకం చేసిన ఖాళీ చెక్కు ఇచ్చాడు. ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు చెల్లించగా రాజశేఖరరెడ్డి రూ.15 లక్షలకు చెక్ బౌన్స్ చేశాడు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రాజశేఖరరెడ్డి తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, మార్చి 12వ తేది ఉదయం వాకింగ్‌కు వెళ్లగా బలవంతంగా కారులో ఎక్కించుకుని చైను, ఉంగరం, సెల్‌ఫో తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘నా మరణానికి కందుల రాజశేఖరెడ్డి, తన బావ చిన్నసుబ్బారెడ్డి, బాలకృష్ణ కారణం. ఇదే నా మరణ వాంగ్మూలం’ అని లేఖలో రాసి ఉంది.

14న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు