నేడు మహాత్మా జ్యోతీబాపూలే జయంతి | - | Sakshi
Sakshi News home page

నేడు మహాత్మా జ్యోతీబాపూలే జయంతి

Apr 11 2025 1:40 AM | Updated on Apr 11 2025 2:39 AM

నేడు మహాత్మా జ్యోతీబాపూలే జయంతి

నేడు మహాత్మా జ్యోతీబాపూలే జయంతి

ఒంగోలు సబర్బన్‌: మహాత్మా జ్యోతీబాపూలే 199వ జయంతిని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా బీసీ సంక్షేమం–సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని కొత్త కూరగాయల మార్కెట్‌ వద్ద ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు. అనంతరం 11 గంటలకు ప్రకాశం భవన్‌లోని స్పందన హాలులో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ వేడుకలకు ప్రతిఒక్కరూ హాజరుకావాలని కోరారు.

వెలిగొండకు కార్యాచరణ రూపొందించాలి

ఒంగోలు సబర్బన్‌: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మిగిలిన పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా అధికారులను ఆర్‌అండ్‌ఆర్‌, జలవనరుల శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశించారు. విజయవాడ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక ప్రకాశం భవనం నుంచి జేసీ గోపాలకృష్ణ, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు సంబంధించిన పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అందుకోసం పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 2026 జూలై నాటికి సాగు, తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్టేజి–1కు సంబంధించి భూ సేకరణను ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో జేసీ సమీక్షించారు. ప్రాజెక్టు ప్రభావిత ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లింపు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలలో సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ ఇంజినీర్‌, భూ సేకరణ స్పెషల్‌ కలెక్టర్‌, ప్రాజెక్ట్స్‌ సూపరింటెండెంటింగ్‌ ఇంజినీరు, మార్కాపురం, కంభం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు (భూసేకరణ), మార్కాపురం, కంభం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలి

ఒంగోలు సబర్బన్‌: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిష్కారం కోసం వచ్చిన రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్య పరిష్కారం వీలుకాని పక్షంలో ఏ కారణం చేత పరిష్కారం వీలు కాదో సంబంధిత లబ్ధిదారునికి తెలియచేయాలని స్పష్టం చేశారు. రెగ్యులరైజేషన్‌ స్కీం–2025 ప్రక్రియపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

నెలాఖరు వరకు వడ్డీ రాయితీ పొడిగింపు

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నుపై 50 శాతం వడ్డీ రాయితీకి గడువు తేదీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వరకు గల పన్ను బకాయిలను 30.04.2025లోపు ఏకమొత్తంగా చెల్లించి అపరాధ రుసుం (వడ్డీ) నుంచి 50 శాతం మినహాయింపు పొందే అవకాశాన్ని పన్ను బకాయిదారులకు ప్రభుత్వం కల్పించింది. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావు కోరారు. పన్నులు చెల్లించడానికి సమీపంలోని వార్డు సచివాలయాలలోగానీ, నగరపాలక సంస్థ కార్యాలయంలోగానీ సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement