
రెండేళ్ల కిందటే జీవం!
గుండెకు వరం..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపు జిల్లాలోని హృద్రోగులకు వరంగా మారుతోంది. సామాన్య ప్రజలకు అత్యున్నత వైద్యసేవలందించాలన్న లక్ష్యంలో భాగంగా
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి క్యాథ్‌ల్యాబ్
మంజూరు చేశారు. ఆ సేవలు ప్రస్తుతం
అందుబాటులోకి రానున్నాయి. క్యాథ్‌ల్యాబ్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
పనులు నత్తనడకన సాగాయి. పనులు పూర్తయినా ల్యాబ్ ప్రారంభానికి నాలుగు నెలలు పట్టింది.
తొలుత అట్టహాసంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే, వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి
పేరు వస్తుందోనని తాత్సారం చేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు శుక్రవారం వైద్యశాఖామంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక్కడ నలుగురు కార్డియాలజిస్ట్‌లకు ఒక్కరే ఉన్నారు.
● వైఎస్సార్ సీపీ హయాంలోనే తొలి అడుగు
● 2023లోనే ఒంగోలు జీజీహెచ్‌కి క్యాథ్‌ల్యాబ్ మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
● అప్పట్లోనే టెక్నీషియన్లు, నర్సింగ్ స్టాఫ్‌కు శిక్షణ
● కూటమి ప్రభుత్వ హయాంలో నత్తనడకన పనులు
● జనవరికి పూర్తయిన పనులు.. నేడు ప్రారంభం
● 4 కార్డియాలజీ పోస్టులకు ఒక్కరితోనే సరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు
జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన పీజీ ఫండ్స్‌తో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2023వ సంవత్సరం డిసెంబర్‌లో టెండర్ పిలిచారు. 6 కోట్ల రూపాయలకుపైగా నిధులు కేటాయించారు. జీజీహెచ్ మొదటి అంతస్తు రూం నంబర్ 120లో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు 2024 జనవరి నుంచి పనులు చేపట్టారు. మార్చి నుంచి ఆగస్టు వరకు సివిల్ పనులు పూర్తి చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత నవంబర్ నాటికి మిషన్ బిగించారు. ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన ప్యాచ్ వర్క్ ఆగింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అక్కడి నుంచి పనులు నత్తను తలపించాయి.
శానిటేషన్, ఐసీసీయూ పనులను జనవరి 25 నాటికి పూర్తి చేశారు. అప్పటి నుంచి జీజీహెచ్‌లో యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 51 మందికి పరీక్షలు చేసి స్టెంట్లు అవసరమైన వారిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.