
కమీషన్లు రయ్యి మనీ!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో ఖజానాకు భారీగా తూట్లు పడుతోంది. పెనాల్టీల రూపంలో ప్రజాధనం వృథా అవుతోంది. నగరపాలక సంస్థ పరిధిలో అధికారుల వాహనాలు మొదలుకొని ఇంజినీరింగ్ విభాగంలో అనేక రకాల వాహనాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సకాలంలో పన్నులు చెల్లించడం లేదు. దీంతో రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు పలు మార్లు కార్పొరేషన్ వాహనాలను సీజ్ చేశారు. పెనాల్టీల రూపంలో రూ.8 లక్షలు ఒకసారి, రూ.3 లక్షలు ఒకసారి రవాణాశాఖకు చెల్లించారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజాధనం వృథాగా పోతోంది.
మూడేళ్లుగా నో రిజిస్ట్రేషన్
నగరపాలక సంస్థలో నీళ్ల సరఫరాకు సంబంధించి రెండు వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. 2021–22వ సంవత్సరంలో ఎన్ క్యాప్ నిధులతో వాటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను రవాణా శాఖ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించారు. వాటికి జత చేసిన 2 ట్రక్కులకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించలేదు. సాధారణంగా ఇంజన్‌కు రిజిస్ట్రేషన్ చేస్తే ఒక నంబరు మాత్రమే వస్తుంది. అదే ట్రక్కు, ట్రాక్టర్ ట్యాంకర్లకు రిజిస్ట్రేషన్ చేస్తే రెండు నంబర్లు వస్తాయి. కానీ ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ట్రక్కులు బిగించిన ట్రాక్టర్లు చట్ట విరుద్ధంగా రోడ్డు మీద తిప్పుతున్నారు.
ప్రైవేటు ట్రాక్టర్లకు రోజుకు రూ.80 నుంచి రూ.90 వేల వరకు చెల్లింపు
ఒంగోలు నగరంలో శివారు ప్రాంతాల ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు ప్రతి రోజూ ప్రైవేటు ట్రాక్టర్ ట్యాంకర్ల యజమానులకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు చెల్లిస్తున్నారు. 45 ట్రాక్టర్లు ప్రతి రోజూ 225 నుంచి 240 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. నగర పాలక సంస్థ టెండర్ ఎస్టిమేషన్ ప్రకారం ఒక్కో ట్యాంకర్ ట్రిప్పునకు రూ.356 చెల్లిస్తుంది. ఈ విధంగా ప్రైవేటు ట్యాంకర్లకు రోజుకు రూ.80 వేలు చెల్లిస్తుంటే మొత్తం మీద కనీసం నెలకు రూ.24 లక్షలు చెల్లిస్తున్నారు. మరి నగర పాలక సంస్థకు ఉన్న రెండు ట్రాక్టర్‌లకు సంవత్సరానికి కట్టాల్సిన పన్నులు ఎందుకు కట్టడం లేదన్న ప్రశ్నలను అధికారుల వద్ద నుంచి సరైన సమాధానం రావడంలేదు. సొంత వాహనాలకు సకాలంలో పన్నులు చెల్లించి తిప్పితే ప్రైవేటు వాహనాలకు చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. కమీషన్ల కోసమే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేషన్ వర్గాల్లోనే భిన్న సర్వరాలు వినిపిస్తున్నాయి.
ఆర్టీఓకు సకాలంలో వాహనాల పన్నులు చెల్లించని ఒంగోలు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ రూ.11 లక్షలు పెనాల్టీలు చెల్లింపు రికార్డులు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్ సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులు రెండో ట్యాంకర్‌ను దాచేసిన అధికారులు మరోసారి చర్చనీయాంశంగా మారిన అధికారుల వ్యవహారం సొంత వాహనాలు ఉన్నా ప్రైవేటు ట్యాంకర్లకు నెలకు రూ.24 లక్షలు చెల్లింపు కమీషన్ల కోసమే అంటూ ఆరోపణలు
ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు
ఇటీవల నగరంలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన ఏపీ 39 యుఆర్ 7561 నంబరుగల ట్రాక్టర్ రికార్డులను చూపించాలని అధికారులు డ్రైవర్‌కు అడిగారు. అయితే డ్రైవర్ నోరెళ్లబెట్టాడు. వెంటనే దానిని వెంగముక్కల పాలెం రోడ్డులోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కార్యాలయ ప్రాంగణానికి తరలించారు. సీజ్‌చేసి రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్‌తో పాటు ఇతర పెనాల్టీలు కట్టి తీసుకెళ్లాలని ఒంగోలు కమిషనర్ కే.వెంకటేశ్వరరావుకు నోటీసులు పంపారు. ఒక వాహనాన్ని పట్టుకున్నారని తెలుసుకున్న కమిషనర్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మున్సిపల్ ఇంజినీర్ పరిస్థితిని సమీక్షించారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న రెండో ట్రాక్టర్‌ను రంగారాయుడు చెరువు సమీపంలోని మంచినీరు సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ వద్ద ఎవరికీ కనపడకుండా దాచేశారు.