
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. మహాత్మా జ్యోతీరావు పూలే 199వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహించిన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, కాపు లబ్ధిదారులకు మెగా రుణ మేళా, యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ బలహీనవర్గాలకు అవసరమైన రుణాలు పంపిణీ చేయడంతో పాటు అన్ని రంగాలలో వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి స్వామి మాట్లాడుతూ బీసీ సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పూలేను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్‌ఓ బి.చినఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
పూలే ఆదర్శాలు ఆచరణీయం : ఎస్పీ దామోదర్
ఒంగోలు టౌన్: విద్యతోనే మహిళల సాధికారిత సాధ్యమవుతుందని నమ్మి దేశంలో బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలను ప్రారంభించిన మహనీయుడు జ్యోతీరావు పూలే అని, ఆయన ఆదర్శాలు ఆచరణీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జ్యోతీరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. మహిళల విద్యతో పాటుగా అనేక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని చెప్పారు. ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ పాటించాలని, ఆయన తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు రవి కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్‌యాదవ్
జ్యోతీరావుపూలేకి నివాళులు

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యం