రేషన్‌ మేస్తూ.. రెచ్చిపోతూ..! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ మేస్తూ.. రెచ్చిపోతూ..!

Apr 13 2025 2:01 AM | Updated on Apr 13 2025 2:11 AM

రేషన్‌ మేస్తూ.. రెచ్చిపోతూ..!

రేషన్‌ మేస్తూ.. రెచ్చిపోతూ..!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో రాత్రి 10 గంటలు దాటితే చాలు.. రేషన్‌ మాఫియా రోడ్డెక్కుతోంది. ఎక్కువగా చిన్నపాటి అప్పి ఆటోల్లో రేషన్‌ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. నంబర్‌ ప్లేట్లు తీసేసిన వాహనాల్లో తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల కంటే మేమేం తక్కువ అన్నట్లుగా పశ్చిమ ప్రకాశంలోని ఓ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి ఏకంగా బియ్యం సిండికేట్‌కు నేతృత్వం వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో ఇన్‌చార్జి అయితే.. మండలానికి ఇద్దరు నాయకులకు జీతమిచ్చి మరీ రేషన్‌ దందాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జిల్లా నాయకులకు పోటీగా పొరుగు జిల్లా నుంచి కూడా ఒక టీడీపీ నాయకుడు వచ్చి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక యువ ఎంపీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక సీనియర్‌ ఎమ్మెల్యే ఆశీసులతో రంగంలోకి దిగిన సదరు టీడీపీ నాయకుడు జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి బియ్యం కొనుగోలు చేసి పట్టపగలే తరలించి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిరుపేదల కడుపులు నింపడానికి గత ప్రభుత్వాలు రేషన్‌ బియ్యం ఇచ్చి ఆదుకోగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలకులు పేదల కడుపుకొడుతూ అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ రేషన్‌ బియ్యాన్ని దొడ్డిదారిన తరలించి అమ్ముకుంటున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. అప్పటి వరకు ఉన్న డీలర్లను బలవంతంగా తొలగించి టీడీపీ నాయకులకు రేషన్‌ దుకాణాలు అప్పగించారు. అనంతరం యథేచ్ఛగా రేషన్‌ బియ్యం తరలిస్తూ రెండుచేతులా సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీ ఒంగోలు నాయకులు ఒంగోలుతో పాటు కనిగిరి, చీరాల నియోజకవర్గాల నుంచి బియ్యం అక్రమ వ్యాపారాన్ని చేజిక్కించుకుని ఒంగోలు కేంద్రంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఒంగోలు నగరం శివారు ప్రాంతానికి చెందిన కార్పొరేటర్‌కు చీరాల, నగర నడిబొడ్డునున్న మరో కార్పొరేటర్‌కు ఒంగోలు, సంతనూతలపాడు, ఒక కాపు నాయకుడికి కనిగిరి నియోజకవర్గ రేషన్‌ బియ్యం వ్యాపారాన్ని అప్పగించినట్లు సమాచారం. వీరితో పాటు ఎమ్మెల్యే దామచర్ల నివాసం ఉండే బీకే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న ఒక వ్యాపారికి కూడా ఈ రేషన్‌ వ్యాపారంలో భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా, నేషనల్‌ హైవేపై ఉన్న పోలీసులకు నెలవారీ మామూళ్లిస్తూ పేదల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం.

కొండపి నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సింగరాయకొండ కేంద్రంగా రేషన్‌ దందా కొనసాగుతోంది. గత డిసెంబర్‌ మొదటివారంలో సింగరాయకొండలోని ఊరిచివర ఉన్న ఒక సినిమా హాలు వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీని డీఎస్‌ఓ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ బృందం దాడి చేసి పట్టుకుంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మధ్య జరుగుతున్న వార్‌లో భాగంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. లారీలోని బియ్యాన్ని రాత్రికిరాత్రే మాయం చేసేందుకు సత్య వర్గానికి చెందిన నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. జనార్దన్‌ ఒత్తిడి మేరకు అధికారులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు పట్టుకున్న లారీలో 780 బస్తాల బియ్యం ఉండగా, కేవలం 103 బస్తాల బియ్యం మాత్రమే ఉన్నట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కొండపి నియోజకవర్గంలో సత్య కనుసన్నల్లోనే రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతోందని, సింగరాయకొండలోని ఒక రైస్‌ మిల్లు యజమానికి ఈ దందాను అప్పగించారని సమాచారం. అతడితో పాటు జరుగుమల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఒక మహిళా నాయకురాలి రైస్‌ మిల్లుకు కూడా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈమె కనిగిరి, సంతనూతలపాడు నుంచి కూడా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొనుగోలు చేసిన బియ్యాన్ని గుజరాత్‌ తరలిస్తుండగా తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో ఈ మహిళా నాయకురాలి రేషన్‌ దందా వెలుగులోకి వచ్చింది.

దర్శి నియోజకవర్గంలో రేషన్‌ బియ్యాన్ని నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో తరలిస్తున్నారు. అంతేగాకుండా ఎవరైనా వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు ఫోన్‌ లిఫ్ట్‌ చేసినా వాహనం నంబర్‌ అడుగుతున్నారని, వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేదని చెప్పగానే.. అయితే, మేమేం చేయలేమని ఫోన్‌ పెట్టేస్తున్నారని సమాచారం. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జి నియమించిన వ్యక్తికే బియ్యం విక్రయించాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. కనిగిరి నియోజకవర్గానికి చెందిన రేషన్‌ బియ్యం వ్యాపారాన్ని జిల్లాలో కీలక ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారు. ఒంగోలుకు చెందిన ఒక నాయకుడు ఇక్కడి ప్రధాన నాయకుడికి నెలవారీ నజరానా ఇవ్వడమే కాకుండా మండల స్థాయి నాయకులకు కూడా మామూళ్లిచ్చి బియ్యాన్ని తరలిస్తున్నాడు.

బేస్తవారిపేటలోని అనంతపురం–అమరావతి హైవేలో ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఒక రైస్‌ మిల్లు అడ్డగా గిద్దలూరు నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం దందా సాగుతోంది. టీడీపీ నాయకుడికి చెందిన ఈ మిల్లుకు నేరుగా సివిల్‌ సప్లయిస్‌ గోడౌన్‌ నుంచే రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి కొత్తగా ప్యాక్‌ చేసి కర్నూలు సోనా, నంద్యాల సోనా, మసూరి రైస్‌ పేరుతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. పట్టుబడిన బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ బిల్లులను అడ్డం పెట్టుకుని రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి కనుసన్నల్లోనే రేషన్‌ బియ్యం దందా జోరుగా జరుగుతోంది. ఐదు మండలాల వ్యాపారులను సిండికేట్‌గా తయారు చేసి పర్యవేక్షిస్తున్నట్లు టీడీపీలోని ఒక వర్గం బహిరంగంగానే ఆరోపిస్తోంది.

జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల అండదండలతో యథేచ్ఛగా రేషన్‌ దందా

పేదల నోళ్లు కొడుతూ విచ్చలవిడిగా రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు

మూడు పువ్వులు ఆరు కాయలుగా బియ్యం అక్రమ వ్యాపారం

ఒక్కో ఎమ్మెల్యేకి నెలకు రూ.25 లక్షలకుపైగా ముడుతున్నట్లు ప్రచారం

పశ్చిమ ప్రకాశంలో అడ్డాగా గిద్దలూరు, యర్రగొండపాలెం

గిద్దలూరులో మండలానికి ఐదుగురు టీడీపీ నాయకులకు నెలవారీ మామూళ్లు

యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జి కనుసన్నల్లో బియ్యం వ్యాపారం

కొండపిలో రేషన్‌ దందా అంతా ‘సత్య’మే

ఒంగోలు వ్యాపారుల చేతుల్లో ఒంగోలు, చీరాల, అద్దంకి, కనిగిరి రేషన్‌ దందా

నేరుగా సివిల్‌ సప్లయిస్‌ గోడౌన్‌ నుంచే టీడీపీ నాయకుల రైస్‌ మిల్లులకు తరలుతున్న

రేషన్‌ బియ్యం

బేస్తవారిపేట రైస్‌ మిల్లు అడ్డాగా...

జిల్లాలో రేషన్‌ బియ్యం దందా జోరుగా సాగుతోంది. పేదలకు దక్కాల్సిన బియ్యం విచ్చలవిడిగా అక్రమంగా

తరలిపోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో జిల్లా సరిహద్దులు

దాటి రాష్ట్రం ఎల్లలు సైతం

దాటిపోతోంది. సంతనూతలపాడు నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్‌ తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని తెలంగాణ పోలీసులు

పట్టుకోవడంతో జిల్లాలో రేషన్‌ దందాపై కూటమి పాలకులు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. మరోసారి రేషన్‌ మాఫియా గుట్టురట్టు కావడంతో

నిరుపేదల నోళ్లు కొడుతున్న

కూటమి పాలకులపై ప్రజలు

దుమ్మెత్తిపోస్తున్నారు.

పట్టుకుంది 780 బస్తాలు..

లెక్క చూపింది 103 బస్తాలు...

నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో బియ్యం తరలింపు...

65 శాతం బియ్యం అడ్డదారిలోనే...

జిల్లాలో 1,392 రేషన్‌ దుకాణాలు ఉండగా, దాదాపు అవన్నీ టీడీపీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోనే ఉన్నాయి. వాటి నుంచి ప్రతి నెలా 9558.348 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాల్సి ఉండగా, సుమారు 65 శాతం బియ్యాన్ని అడ్డదారుల్లో కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నారు. కేవలం 35 శాతం బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి మండలం నుంచి ఇద్దరుముగ్గురు టీడీపీ నాయకులను నియమించి వారికి రేషన్‌ డీలర్ల నుంచి నెలవారీ జీతాలిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంగోలు నుంచి మొదలుకుని కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలలో ప్రతి మండలంలోనూ కనీసం ఇద్దరు టీడీపీ నాయకులు రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారానికి మేనేజర్లుగా పనిచేస్తున్నారని సమాచారం.

ఒంగోలు కేంద్రంగా విస్తరించిన

రేషన్‌ దందా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement