
బడుగుల కోసం అంబేడ్కర్ అవిశ్రాంత పోరు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు వన్‌టౌన్: సమ సమాజ స్థాపన కోసం, బడుగుల అభ్యున్నతికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అవిశ్రాంతంగా పోరాడారని కలెక్టర్ తమీమ్ అన్సారియా కొనియాడారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో సోమవారం సభ నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ఉన్న బాబా సాహెబ్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్‌తో పాటు దళిత సంఘాల నాయకులతో కలిసి ఆమె ఘన నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా అంబేడ్కర్ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, హక్కుల సాధన కోసం అంబేడ్కర్ తన జీవితాంతం పోరాడారన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతోందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లో అక్ష్యరాస్యత కొంత తక్కువగానే ఉందన్నారు. బడి వయసు ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు. ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ అంబేడ్కర్ గొప్ప మేధావని, దార్శినికుడని కొనియాడారు. మరో ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర గురించి ప్రజా గాయకుడు నూకతోటి శరత్ రచించి గానం చేసిన ఆడియోను ఆవిష్కరించారు. డీఆర్‌ఓ చిన ఓబులేసు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్.లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ పి.శ్రీనివాస ప్రసాద్, దళిత నాయకులు నీలం నాగేంద్రరావు, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, చప్పిడి వెంగళరావు, బిళ్లా చెన్నయ్య పాల్గొన్నారు.