
కొండగట్టు(చొప్పదండి): ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన, ఏళ్లచరిత్రగల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిదింది. చోరీ చిన్నదే అయినా.. ఆలయ చరిత్రలో తొలిసారి కావడం కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. అయితే, కొద్దిరోజుల తేడాతోనే దొంగలు చోరీకి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది.
దొంగతనం జరిగింది ఇలా..
శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడ్డారు. 2.20గంటల వరకు తమ పనికానిచ్చేశారు. తొలుత ఆలయం వెనకాల ద్వారాల తాళాలు పగుల గొట్టారు. అనంతరం అంతరాలయంలోకి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న తలుపుల పట్టీలు తొలగించి లోనికి ప్రవేశించారు. గర్భాయంలోని స్వామివారి కిరీటం, మకర తోర ణం, శ్రీరామ రక్షగొడుగులు, మకర తోరణ స్తంభం, రెండు శఠగోపాలు, కవచం, అంతారాలయ తోరణాలు, ,శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయలోని మరోరెండు శఠగోపాలు, మరికొన్ని వస్తువులను అపహరించారు. ఆలయంలోని హనుమాన్ విగ్రహంపై గల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్ష తోకవారం, పదుకలు, ఉత్సవమూర్తి, అంతరాలయంలని తోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండి తోరణం, పాదుకలు, శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువుల జోలికి వెళ్లలేదు. మొత్తంగా 15కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.9లక్షల విలువ ఉంటాయని ఈవో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
ఆలయానికి పటిష్టమైన భద్రత లేదు. ఉన్న ఒక అధికారి కూడా రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంలేదు. దీంతో సిబ్బంది తమకు ఇష్టమైనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. భక్తులు నిత్యం గర్భాలయంలోకి రావడం, వారితోనే అధికారులు, అర్చకులు పనులు చేయించుకోవడం, అధికారులు, సిబ్బంది చేయాల్సిన విధులను సెక్యూరటీ గార్డులు, ఇతర వ్యక్తులతో చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవో, ఆలయ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపం ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తంగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడం పెద్దలోపంగా కనిపిస్తోంది.
12మందితో సెక్యూరిటీ..
ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు 12 హోంగార్డులు ఉన్నారు. వీరు ఉదయం 6గంటల – 6 గంటల వరకు ఆరుగురి చొప్పున విధులు నిర్వర్తిస్తారు. రాత్రివేళలో నలుగురు హోంగార్డులు విధుల్లో ఉంటారు. రోజూ మాదిరిగానే రాత్రి వరకు ఓ హోంగార్డు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపరచడానికి వెళ్లిన స్వీపర్లు.. గర్భాయంలో కోతులు ఉండటం, సామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడాన్ని గమనించారు. వెంటనే ఆలయ ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆలయ ఈవో వెంకటేశ్‌కు సమాచారం అందించారు. ఆలయ ఈవో ఘటపై పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్..
సమాచారం అందుకున్న పోలీసులు.. ఆలయానికి చేరుకున్నారు. భేతాళస్వామి ఆలయ పరిసరాల్లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. నిత్యం స్వామి వారికి వినియోగించే సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలో హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను వారికి దొరికింది. ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, సైబర్ టీం ఆల య పరిసరాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీ లిస్తోంది. భక్తుల కోరికలు తీర్చే అంజన్న ఆలయంలోనో దొంగతనం జరగడం బాధాకరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామన్న సమయంలో ఇలా దొంగతనం జరగడం విషాదకరమన్నారు.
10 బృందాలతో గాలింపు డీఎస్పీ ప్రకాశ్ నేతృత్వంలో 10 పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. ఇందులో నలుగురు సీఐలు, 15 మంది ఏఎస్సైలు ఉన్నారు.
జగిత్యాలక్రైం/కొండగట్టు(చొప్పదండి): విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దోపిడీలో పాల్గొన్న దొంగలు ఉత్తరభారతీయులు లేదా పొరుగు రాష్ట్రంవారు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వీడియోల ఆధారంగా.. పోలీసులు ఈ మేరకు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. ఆలయం వెనక భాగాన ఉన్న భేతాళుడి గుడి నుంచి దొంగలు తలుపులు బద్దలు కొట్టినట్లు గుర్తించారు.
చూసేవారికి అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డులను తలపించేలా డ్రెస్సింగు వేసుకుని, చేతిలో లాఠీలు పట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనబడకుండా తలలకు మంకీ క్యాపులు ధరించి, ఒంటిని పసుపురంగు శాలువాలతో కప్పుకున్నారు. తలుపులు బద్దలు కొట్టేందుకు వీలుగా ఉండే రెంచ్‌లు, ఇతర పనిముట్లను శాలువాల చాటును లోనికి తీసుకువచ్చారు. వీరి కదలికలు ఆహార్యం, ఆకారాలను బట్టి వీరు ఉత్తరభారతీయులుగా అనుమానిస్తున్నారు. వారంరోజులుగా జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆలయాల చోరీలకు, వీటికి ఏదైనా లింకుందా లేదా? అన్న విషయాలను సైతం పోల్చిచూస్తున్నారు.
రాత్రిపూట వెండి తాపడాలను పనిముట్లతో తొలచుకుపోయినా ఎలాంటి చడీచప్పుడు రాకుండా జాగ్రత్తపడ్డారంటే వీరంతా పక్కా ప్రొఫెషనల్ గ్యాంగ్ అన్న నిర్ధరణకు వచ్చారు. వీరికి సంబంధించిన కీలక సమాచారం కూడా పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. వీరు మహారాష్ట్రవైపు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
పోలీసులపై చర్యలు..!
ఈ క్రమంలో ఆలయానికి రాత్రిపూట భద్రత కల్పించిన పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు విధుల్లో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
దొంగలను గుర్తించిన పోలీసులు?
ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సీసీపుటేజీల్లో రికార్డుల ప్రకారం దొంగలను పోలీసులు గుర్తించి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారి ఉన్న ఆచూకి కూడా కనుగొన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీరి అరెస్టును పోలీసులు ధ్రువీకరిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.
సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమైన కదలికలు
సెక్యూరిటీ గార్డులు, భక్తుల్లా డ్రెస్సింగ్
చోరీ అనంతరం మహారాష్ట్ర వైపు ప్రయాణం?
పోలీసుల వద్ద కీలక సమాచారం
ఆలయంలో దొంగతనం జరగడం చాలా బాధాకరం. ప్రాయశ్చిత్తం కోసం హోమం, మూడు దేవతలకు 11లీటర్ల పాలతో అభిషేకం, 1008 నామాలతో పూజలు నిర్వహించాం. ఆ తర్వాతనే భక్తులకు అనుమతించాం.
– జితేంద్రప్రసాద్, అర్చకుడు, కొండగట్టు ఆలయం
Comments
Please login to add a commentAdd a comment