‘సాక్షి’లో ఫిబ్రవరి 22న ప్రచురితమైన కథనం
● లిఖిత పూర్వకంగా రాసిచ్చిన సర్పంచులు ● నోరువిప్పని పంచాయతీ కార్యదర్శులు ● సమగ్ర వివరాలు ఇవ్వని డీఎల్‌పీవో ● ‘సాక్షి’ కథనంతో సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశాలు
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా డివిజినల్ లెవల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో) రాగంపేట మల్లికార్జున్‌పై రెండో రోజు శుక్రవారం కలెక్టరేట్‌లో విచారణ కొనసాగింది. జిల్లాలో పలువురు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారుల వద్ద డీఎల్పీవో డబ్బులు అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ‘సాక్షి’లో ‘పల్లెల్లో వసూళ్లకు చెకింగ్’ అనే శీర్షికన ఫిబ్రవరి 22న కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన కలెక్టర్ అనురాగ్ జయంతి డీఎల్పీవో మల్లికార్జున్‌ను సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణ కోసం జిల్లా ఆడిట్ అధికారి స్వరూపను ఆదేశించారు. జిల్లా ఆడిట్ అధికారి స్వరూప గురువారం పంచాయతీ కార్యదర్శులను, గ్రామాల సర్పంచులను విచారించారు. కొందరు గ్రామ సర్పంచ్‌లు డీఎల్‌పీవో వసూళ్లపై లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం జిల్లా ఆడిట్ ఆఫీస్ వద్దకు విచారణకు వచ్చిన డీఎల్‌పీవో మల్లికార్జున్ సరైన వివరాలు ఇవ్వకుండా.. వెళ్లినట్లు తెలిసింది. జిల్లా ఆడిట్ అధికారి వద్ద జరిగే విచారణకు రావద్దని, వచ్చినా తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయొద్దని డీఎల్పీవో.. ముందుగానే పంచాయతీ కార్యదర్శులు, బాధిత సర్పంచులను కలిసి బతిమిలాడినట్లు సమాచారం. తనకు కొద్ది నెలలే సర్వీసు ఉందని, ఈ దశలో ఇబ్బందులకు గురిచేయొద్దని, మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ.. ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే మరో మూడు రోజుల్లో విచారణ పూర్తవుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment