
పత్తాలేని వడ్డీ రాయితీ!
● అన్నదాతల ఎదురుచూపులు ● వడ్డీభారంతో ఆందోళన ● జిల్లాలో 61,740 మంది రైతులు ● రూ.808.46కోట్ల పంట రుణాలు ● రూ.24.24 కోట్ల రిబేట్ బకాయి
ముస్తాబాద్(సిరిసిల్ల): పంట రుణాలపై వచ్చే వడ్డీ రాయితీపై స్పష్టత కరువైంది. వానాకాలం సీజన్ ముగిసినా రుణాల రిబేట్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంటకాలం ముగుస్తున్న క్రమంలో వానాకాలం పంట రుణాల రిబేట్ బ్యాంక్ ఖాతాల్లోకి జమకావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. క్రమం తప్పకుండా పంట రుణాల వడ్డీ చెల్లిస్తున్న రైతులకు రావాల్సిన రిబేట్‌ను ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రైతుల పంట రుణాలపై 3 శాతం రిబేట్‌ను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 4శాతం రిబేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రిబేట్‌ను జమచేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లుగా రిబేట్‌ను ఇవ్వడం లేదు.
కేంద్రంపైనే రైతుల ఆశలు
రైతులు తీసుకున్న పంట రుణాలపై ఏటా కేంద్ర ప్రభుత్వం 3 శాతం రాయితీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం మొత్తంగా 7శాతం రాయితీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం గతేడాది వరకు 3 శాతం రాయితీని రైతుల ఖాతాల్లో జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా రిబేట్‌ను జమ చేయడం లేదు.
రూ.24.24 కోట్ల రిబేట్ బకాయి
జిల్లాలో 61,740 మంది రైతులకు రూ.808.46 కోట్ల పంట రుణాలు అందించారు. ఇందులో కేంద్రం 3 శాతం రిబేట్‌గా రూ.24.24 కోట్లు బకాయిపడింది. జిల్లాలో పంట రుణాలు పొందిన 61,740 మంది రైతుల్లో తొంభై శాతం మంది రెగ్యులర్‌గా వడ్డీ చెల్లించినవారే. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి, రుణాలు రెన్యూవల్ చేసుకున్న రైతులకై నా రిబేట్ వర్తింపచేయాలని కోరుతున్నారు.
దీర్ఘకాలిక రుణాలపై కోత
పదేళ్ల క్రితం వరకు సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు 6 శాతం రిబేట్‌ను వారి ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్వల్పకాలిక పంటరుణాలకే రిబేట్‌ను పదేళ్లుగా అందించలేదు. ఇక దీర్ఘకాలిక రుణాలపై రిబేట్ ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందని రైతులు భావిస్తున్నారు. స్వల్పకాలిక రుణాలపై డిసెంబర్ వరకు రైతులు వడ్డీని చెల్లించి ఉన్నారు. కేంద్రం కూడా ఆలోగానే రిబేట్‌ను జమ చేయాల్సి ఉంది.
పంట రుణాలు ఇలా..
రుణాలు పొందిన రైతులు : 61,740
రుణాల మొత్తం : రూ.808.46 కోట్లు
రావాల్సిన రిబేట్: రూ.24.24 కోట్లు
ఇది ముస్తాబాద్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ఈ సహకార సంఘంలో 755 మంది రైతులు రూ.8.80కోట్ల పంట రుణాలు పొందారు. రైతులు తీసుకున్న పంట రుణాలలో 3 శాతం చొప్పున రిబేట్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ రైతుకు రిబేట్ జమకాలేదు. ముస్తాబాద్ సింగిల్‌విండో పరిధిలోని రైతులకు దాదాపు రూ.24 లక్షల రిబేట్ రావాల్సి ఉంది. ఇది ఒక్క ముస్తాబాద్ సహకార సంఘంలోని సమస్యే కాదు. జిల్లాలోని 23 సహకార సంఘాలు, 50 వాణిజ్య బ్యాంకుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్య.

పత్తాలేని వడ్డీ రాయితీ!
Comments
Please login to add a commentAdd a comment