● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: దివ్యాంగులకు యూడీఐడీ(యూనిక్ డిసేబులిటీ గుర్తింపు కార్డులు) జారీ చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో యూడీఐడీ కార్డుల జారీపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లకు బదులుగా యూనిక్ డిసేబులిటీ గుర్తింపుకార్డులను ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు వైద్యులు ధ్రువీకరించిన వైకల్యశాతంతో కూడిన సదరన్ సర్టిఫికెట్, పూర్తి వివరాలు జనరేట్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. దృష్టి, కుష్టి వ్యాధిగ్రస్తులు, వినికిడి, అంగవైకల్యం, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి(యూడీఐడీ) కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడీఐడీ జనరేట్ చేస్తారని వివరించారు. ఆస్పత్రిలో యూడీఐడీ నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులను, పరికరాలు ఉండేలా చూడాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పి.పెంచలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment