
రోడ్ ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్
● జిల్లాలో పన్నులు చెల్లించని వాహనాలు 6వేలు ● ఇప్పటికే 74 కేసులు నమోదు చేశాం ● రూ.14.18లక్షలు వసూలయ్యాయి ● జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్
సిరిసిల్ల: రోడ్ ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లాలో 6వేలకు పైగా వాహనాలు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నాయని, వాటిని పట్టుకునేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పన్నుల వసూళ్లకు, ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలను కట్టడి చేసేందుకు రవాణాశాఖ తీసుకుంటున్న చర్యలను ‘సాక్షి’కి వివరించారు.
15 ఏళ్లు దాటితే రెన్యూవల్ చేసుకోవాలి
జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోవాలి. లేదంటే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తాం. జిల్లాలో అన్ని వాహనాలు 1,48,382 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 1,02,879 బైకులు ఉన్నాయి. రెండో స్థానంలో కార్లు 13,545 ఉన్నాయి. ఏ వాహనమైన 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోవాలి.
రోడ్ ట్యాక్స్ చెల్లించని వాహనాలకు జరిమానాలు
జిల్లాలో మూడు నెలలకోసారి చెల్లించాల్సిన రోడ్ ట్యాక్స్‌ను చెల్లించకుండా 6వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. అత్యధికంగా కమర్షియల్ ట్రాక్టర్లు, వాటి ట్రాలీలు ఉన్నాయి. ఇప్పటికే 74 కేసులు నమోదు చేసి రూ.14.18లక్షలు ఫిబ్రవరిలోనే వసూలు చేశాం. వాహనదారులు గడువు దాటిన తర్వాత రోడ్ ట్యాక్స్ చెల్లిస్తే అదనంగా 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. అదే మేం పట్టుకుని కేసు నమోదు చేస్తే.. 200 శాతం అదనంగా జరిమానా విధిస్తాం. వాహనదారులు సకాలంలో రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. గడువు దాటితే అదనపు ఆర్థికభారం తప్పదు.
ఓవర్‌లోడ్‌తో వెళ్తే కేసులు నమోదు
జిల్లాలో సామర్థ్యానికి మించి ఓవర్‌లోడుతో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేస్తాం. సామర్థ్యం మేరకు లోడును నింపుకుని వెళ్లాలి. జిల్లాలో ఫిట్‌నెస్ లేని వాహనాలు 12,700 ఉన్నాయి. వాటిని పట్టుకుని సీజ్ చేస్తాం. సకాలంలో ఫిట్‌నెస్ చేయించుకోవాలి.
ప్రచారం చేస్తున్నాం
జిల్లాలో రోడ్ ట్యాక్స్ వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ముందే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లాలో ప్రచారం చేశాం. మంచి పాటలను రాయించి వాహనదారులకు అవగాహన కల్పించాం. మార్చి నెలాఖరులోగా పూర్తిస్థాయిలో రోడ్ ట్యాక్స్ వసూళ్లకు ప్రణాళికను రూపొందించాం. వాహనదారులు స్పందించి పన్నులు చెల్లించాలి.

రోడ్ ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్‌డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment