
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● ఓటేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి ● 27న సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ● నోడల్ అధికారి శ్రీనివాసాచారి
సిరిసిల్లకల్చరల్: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నోడల్ అధికారి, సీపీవో పీబీ శ్రీనివాసాచారి సూచించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల విధులు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల ప్రక్రియపై సోమవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 28 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 27న ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఒక రోజుముందుగానే పోలింగ్ డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకోవాలన్నారు. కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపుకార్డుతో వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలు ప్రకటించేలా సెక్టార్ అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. శిక్షణలో 40 మంది ప్రిసైడింగ్ అధికారులు, 40 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 88 మంది ఓపీవోలు, 15 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మాస్టర్ ట్రెయినర్లు మహేందర్‌రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment