ఎములాడ దారిలో..
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు వరంగల్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్జత సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనలకు మాత్రమే అనుమతించారు. రూ.2.39 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. గుడి చెరువు ఖాళీ స్థలంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి పేయిడ్ పాస్‌లను అధికారులు జారీ చేశారు. పట్టణమంతా పోలీసుమయం కావడంతో భక్తులు, స్థానికులు పట్టణంలోకి వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. జాతరకు ఈసారి 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
రాజన్నకు పట్టువస్త్రాల సమర్పణ
స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు., టీటీడీ దేవస్థానం అర్చకులు సైతం పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఆలయ డిప్యూటీ ఈవో లోక్‌నాథ్ ఆధ్వర్యంలో అర్చకులు, ట్రస్టు సభ్యులు మంగళవారం రాత్రి రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు స్వస్థితో స్వాగతం పలుకగా, ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి స్వాగతం పలికారు. శృంగేరి శారదాపీఠం పక్షాన రాధాకృష్ణశర్మ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రాక్షమాలను సమర్పించారు.
జాతర ఏర్పాట్లు పరిశీలన
జాతరలో ఏర్పాట్లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్‌లు మంగళవారం పరిశీలించారు. భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వారి వెంట ఆర్డీవో రాజేశ్వర్, ఈవో వినోద్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
నిరంతరం అన్నదానం
జాతర మహోత్సవాల్లో పాల్గొనే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారాలు మధ్యాహ్నం వరకు నిరంతరం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్‌లు తెలిపారు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు
జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఏడు అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యాధికారి రజిత మంగళవారం పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బంది స్పందించి వైద్య సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర వేళల్లో 108ను ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఉచిత బస్సు సదుపాయం
వేములవాడ అర్బన్: భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజన్న గుడి చెరువు వరకు ప్రతీ 15 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వేములవాడరూరల్: జాతరలో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వేములవాడ ఫైర్‌స్టేషన్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి విధులకు వచ్చిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.
ఆలయంలో నేడు జరిగే ఉత్సవాలు
వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు
ఉదయం 4 నుంచి 4.25 వరకు సుప్రభాత సేవ
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన
రాత్రి 11.35 నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
వైభవంగా రాజన్న జాతర షురూ
తరలివస్తున్న భక్తులు
నేడు మహాశివరాత్రి వేడుకలు
రూ.2.39 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు
గుడి చెరువులో శివార్చన
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది, టీటీడీ అర్చకులు
ఎములాడ దారిలో..
Comments
Please login to add a commentAdd a comment