నేనొస్తా... వేములవాడ జాతరకు
● తరలివస్తున్న పల్లె భక్తులు ● రాజన్న సన్నిధిలోనే జాగారం ● నేటికీ నాటి సంప్రదాయమే..
వేములవాడరూరల్: ఏమి లేని వేములవాడలో రాజన్న ఏమి చూసి నిలిచితివయ్యా రాజన్న అంటూ.. పల్లె భక్తులు నెత్తిన ముల్లె, సంకన పిల్లతో గ్రామీణ ప్రాంతాల నుంచి రాజన్న జాతరకు తరలివస్తున్నారు. పేదల పెన్నిధిగా నిరుపేదలకు అండగా పేరున్న బోళాశంకరుని సన్నిధానంలో శివరాత్రి రోజు జాగారం జరుపుకోవడం పల్లె, పట్టణ భక్తులకు ఆనవాయితీ. ఏటా ఎన్ని కష్టాలైనా భరించి రోడ్లపైన స్థలాల మీదనే జాగారం జరుపుకుని మూ డు రోజులు ఉండి తిరుగు ప్రయాణమవుతారు.
నిరుపేదలకు ఆరు బయటనే విడిది
రాజన్న సన్నిధికి వచ్చే భక్తులలో అత్యధిక శాతం శివరాత్రి రోజు గ్రామీణ ప్రాంత భక్తులు తరలివస్తారు. వీరికి ఎక్కడా ఆలయ వసతిగదులు దొరకవు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడే విడిది చేసి జాగారాలు చేసుకుంటారు. ఉదయాన్నే స్వామివారికి నైవేద్యం వండుకుని భోజనం చేసి తిరుగు ప్రయాణం అవుతారు.
నేటికీ నాటి సాంప్రదాయమే..
కోరుట్ల, నిజామాబాద్, ఆర్మూర్, ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రూరల్ మండలంలోని పోచెట్టిపల్లి వద్ద ఉన్న ధర్మగుండంలో స్నానాలు చేసి రాజన్న సన్నిధానానికి వస్తారు. కొన్నేళ్లుగా ఆ ప్రాంతం నుంచి ఎడ్ల బండ్లపై వచ్చే భక్తులు అక్కడ స్నానాల అనంతరం రాజన్న దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పటికీ కొంత మంది భక్తులు అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment