
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి
● పల్లెల్లో కిష్కిందకాండ ● గూనపెంకలను పీకి పడేస్తున్న కోతులు ● వానరమంద దాడులతో పలువురికి గాయాలు ● మంకీఫుడ్ కోర్టు నిర్వహణపై నిర్లక్ష్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గూనపెంకులు పగులుతున్నాయి. జామచెట్లు, కొబ్బరిచెట్లు విరిగిపోతున్నాయి. అడ్డుగా పోతే మీదికొచ్చి దాడులు చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇల్లు గుల్లచేస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో నిత్యం కోతుల దాడులతో పల్లెజనం భీతిల్లుతున్నారు. వానరసైన్యాన్ని కట్టడి చేయడం తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కోతులు సృష్టిస్తున్న కిష్కిందకాండపై స్పెషల్ ఫోకస్..
సూర్యోదయంతోనే దాడి
కోతుల సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. సూర్యోదయంతోనే ఇళ్లపై దాడిచేస్తున్న కోతులను వెల్లగొట్టేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పక్కన పెంచుకున్న కూరగాయల చెట్లను పీకేయడం, జామకాయలు కొరికేయడం, పెంకుటిళ్లపైన గూనపెంకులు తొలగిస్తున్నాయి. పెంకుటిళ్లలో నివసించే వారు రానున్న వర్షాకాలంలో తమ ఇళ్లు ఉంటాయా? వర్షాలకు కూలుతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు తమ పాత ఇళ్లను కూలగొట్టి భవంతులు కట్టుకునేందుకు ముగ్గు పోసుకుంటున్నారు.
భయాందోళనలో గ్రామస్తులు
ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో కోతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో కోతులు దాడి చేస్తున్నాయనే భయంతో ఓ వృద్ధురాలు పరుగెత్తి ఇంటి ముందు ఉన్న తాగునీటి బావిలో పడే త్రుటిలో ప్రాణాపాయంతో బయటపడింది. మండలంలోని నారాయణపూర్, బండలింగంపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో కోతుల దాడుల్లో పలువురు గాయపడ్డారు.
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు
రాచర్లబొప్పాపూర్ మాజీ సర్పంచ్ కొండాపురం బాల్‌రెడ్డి తన సొంత ఖర్చులు రూ.4లక్షలు వెచ్చించి ఈనెలలోనే కోతులను పట్టే వారిని ఏడాదిపాటు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. గ్రామంలో కోతులు కనిపించకుండా చూసే బాధ్యత వారిదే. వీరు ఏడాదిపాటు గ్రామంలో కోతులు కనిపిస్తే పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేస్తుంటారు. దీంతో రాచర్లబొప్పాపూర్‌లో ప్రస్తుతం కోతుల బెడద లేదు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో దాతలు డబ్బులు పోగుచేసి కోతులను పట్టించే వారిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కోతుల చేష్టలతో వేగలేక పల్లెజనం కోతులను వెల్లగొట్టేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కోతుల బెడద నివారణకు కొండెంగలను తీసుకొచ్చి గ్రామంలో తింపుతున్నారు. దీంతో పాక్షికంగా వీటి సమస్య పరిష్కారమైనా మళ్లీ మరుసటి రోజే ఇళ్లపై చేరి కిష్కిందకాండ సృష్టిస్తున్నాయి.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని ఇళ్లపై కోతుల మంద. సూర్యోదయానికి ముందే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. హఠాత్తుగా పది నుంచి ఇరువై వరకు కోతుల మంద ఇళ్లపై దాడి చేస్తున్నాయి. గూనపెంకులు పగులగొడుతూ.. ఇళ్లలోకి దూరి నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఇంటిని చిందరవందర చేస్తున్నాయి. కోతులను ఎల్లగొట్టేందుకే ఇంటిలో ఒకరు ఉదయం కనీసం రెండు గంటలు వెచ్చించాల్సి వస్తోంది.
ఎండిపోయిన చెట్లు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ పరిధిలోని బాకూర్‌పల్లి తండాలోని మంకీ ఫుడ్‌కోర్టు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కోతులను ఊళ్లలో నుంచి తరిమేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ సరిగ్గా లేక చెట్లు ఎండిపోయాయి. ఫలితంగా కోతులకు అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్కపోవడంతో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. జిల్లాలోని గతంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్‌కోర్టుల్లో చెట్లు ఎండిపోయి, కనీసం పచ్చదనం కూడా కరువైంది. తంగళ్లపల్లి మండలంలోని కస్బెకట్కూర్‌లోని మంకీ ఫుడ్‌కోర్టు వర్షానికి వచ్చిన వరదలకు కొట్టుకుపోయి ఆనవాళ్లు కూడా లేవు.
ఇబ్బంది చూడలేక..
గ్రామంలో కోతులు సృష్టిస్తున్న ఇబ్బందులు అనేకం ఉన్నాయి. గ్రామస్తులు నిత్యం పడుతున్న కష్టాలను చూడలేక నేనే సొంతంగా రూ.4లక్షలు ఖర్చు చేసి కోతులను పట్టేవారిని మాట్లాడిన. ఏడాదిపాటు గ్రామంలో కోతులు పట్టే బాధ్యత వారికి అప్పగించిన. అప్పటి నుంచి మా ఊరిలో కోతుల బెడద తగ్గింది.
– కొండాపురం బాల్‌రెడ్డి, రాచర్లబొప్పాపూర్ మాజీ సర్పంచ్
ప్రభుత్వ ఆదేశాలు ఏమి లేవు
కోతుల నివారణ చర్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. మండలంలోని చాలా గ్రామాల్లో గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోతులను పట్టే వారిని మాట్లాడుకుంటున్నారు. పల్లెల్లో కోతుల సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కొన్ని గ్రామాల్లో కొండెంగలను కొనుగోలు చేసి కోతులను తరుముతున్నారు.
– సత్తయ్య, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment