ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మనదే
● పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
కరీంనగర్ కార్పొరేషన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్‌ల్లోని పార్టీ మండల అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి మండల అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
రోజంతా అభ్యర్థుల ఫోన్ కాల్స్
● వాట్సాప్ గ్రూపుల్లో మేస్సేజ్‌లు
కోరుట్ల: ఎమ్మెల్సీ అభ్యర్థులు బుధవారం రోజంతా తమకే ఓటు వేయాలంటూ ఓటర్లకు ఫోన్ చేశారు. ఒక అభ్యర్థి కాల్ ముగియగానే మరొకరు ఫోన్ చేయడంతో వారు విసిగిపోయారు. ఒకరిద్దరు అభ్యర్థులైతే తాము గెలిస్తే ఏం చేస్తామో ఏకంగా 5 నిమిషాలపాటు చెప్పడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశారు. వాట్సాప్ గ్రూపుల్లో లెక్కలేనన్ని మెస్సేజ్‌లు వచ్చాయి.
జాతీయ పోటీలకు రణధీర్
కరీంనగర్‌స్పోర్ట్స్: బిహార్ రాష్ట్రంలోని పాట్నలో మార్చి 10నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 20వ జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు కరీంనగర్‌లోని ప్రభుత్వ సవరన్ పాఠశాలకు చెందిన విద్యార్థి రణధీర్‌చరణ్ ఎంపికయ్యాడు. ఈ నెల 18,19వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఐదు కిలో మీటర్ల రేస్‌వాక్‌లో డి.రణధీర్ చరణ్ బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా నుంచి రణధీర్ ఒక్కడే జాతీయ పోటీల్లో పాల్గొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment