
పోలింగ్‌కు వేళాయె
● పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు
● గ్రాడ్యుయేట్స్ 499, టీచర్స్ 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు
● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
● పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది
● అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లాలో 103 పోలింగ్ కేంద్రాలు
● 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు అనుమతి
– వచ్చే నెల 3న కౌంటింగ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజవర్గాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 15 జిల్లాలు 42 నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది, పోలీసులు వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరారు. నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి హోరాహోరీ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు బుధవారం పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లా 103 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు.
కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఇతర సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్, మరో ఉద్యోగితోపాటు భద్రతకు పోలీసులను కేటాయించారు. వీరంతా గురువారం ఉదయం 6.30 గంటలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతీ కేంద్రం వద్ద వెబ్‌కాస్టింగ్‌తోపాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటున్నందున కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని పోలీసులు సూచించారు. పోలింగ్ అనంతరం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. మొత్తం 15 జిల్లాల్లోని 271 మండలాల నుంచి బ్యాలెట్ బాక్సులు శుక్రవారం ఉదయంలోపు ఇక్కడికి చేరనున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56 మంది.. 3,55,159 ఓట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణతో కలిపి మొత్తం 56మంది పోటీ పడుతున్నారు. 3,55,159 మంది ఓటర్లు 499 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా 1,60,260 మంది పట్టభద్రులు, 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటేయనున్నారు.
టీచర్స్ బరిలో 15 మంది.. 27,088 ఓటర్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్‌పీసీ మద్దతుతో వై.అశోక్‌కుమార్, ఎస్‌టీయూ, సీపీఎస్‌ల నుంచి కూర రఘోత్తంరెడ్డిలతో కలిపి 15 మంది ఉన్నారు. 274 పోలింగ్ కేంద్రాల్లో 27,088 మంది ఓటు వేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో 8,135 మంది 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment