
హరహర మహాదేవ
● వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ● రాజన్నను దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు
● మారుమోగిన శివనామస్మరణ ● 48 గంటలు నిరంతరం దర్శనాలు ● అలరించిన శివార్చన
వేములవాడ: ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవ.. నామస్మరణలతో వేములవాడ మారుమోగింది. ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణ కాశీ వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాడు రాజరాజేశ్వరస్వామిని దాదాపు 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణం గంధవర్ణశోభితమైంది. మహాలింగార్చ న వైభవోపేతంగా సాగింది. నిరంతరం లఘు దర్శనాలు కొనసాగాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. క్యూలైన్లలో సొమ్మసిల్లి పడిపోయిన భక్తులను ఆలయ ఆవరణలోని ప్రథమ చికిత్స కేంద్రాలకు తరలించారు. లింగోద్భవ సమయంలో శ్రీస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ వసతి గదులు విధులకు హాజరైన ఉద్యోగులకు కేటాయించడంతో భక్తులు చలవపందిళ్ల కిందే సేదతీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఈవో వినోద్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దారు మహేశ్ పరిశీలించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎస్‌బీఐ బ్యాంకు 15 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు స్థానిక బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సంపత్ తెలిపారు.
వైభవంగా సామూహిక మహాలింగార్చన
సామూహిక మహాలింగార్చన వైభవంగా జరిగింది. కల్యాణ మండపంలో అర్చక బృందం మహాలింగార్చన రెండు గంటలపాటు సాగింది. మట్టితో చేసిన 366 మృత్తికలు, పిండితో చేసిన 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి, అభిషేకం చేశారు.
అలరించిన ప్రత్యేక కార్యక్రమాలు
● సాయంత్రం 4 గంటలకు శివస్వాముల రాజన్నను దర్శించుకున్నారు.
● సాయంత్రం 6 గంటలకు అనువంశిక అర్చకులు మహాలింగార్చన నిర్వహించారు.
● సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరాయంగా శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

హరహర మహాదేవ
Comments
Please login to add a commentAdd a comment