గమ్మత్తు.. చిత్తు
● గిరిజన గ్రామాల్లో బాధితులు ● నమోదవుతున్న కేసులు ● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
వీర్నపల్లి(సిరిసిల్ల): గిరిజన గ్రామాల్లోనూ గంజా యి బాధితులు ఉన్నారు. సాధారణంగా అటవిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో గంజాయి సాగు చేసి మైదాన ప్రాంతంలో వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు రివర్స్ అయ్యాయి. కొన్నేళ్లుగా పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పల్లెల్లో గంజాయి సాగు నిలిచింది. అయితే గిరిజన గ్రామాల్లోని యువత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయికి బానిసలుగా మారారు. మత్తు కోసం రవాణా చేస్తూ పట్టుబడి జైలుపాలవుతున్నారు. ఈ సంఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గ్రామశివారులే అడ్డాలు
వీర్నపల్లి మండలంలోని శివారు ప్రాంతాలే గంజాయి అడ్డాలుగా మారాయి. చీకటి పడితే శివారు ప్రాంతాలకు చేరుకొని మత్తులో చిత్తవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేసినా వీరి ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది.
స్నేహితులకు అలవాటు చేస్తూ
● లాల్‌సింగ్‌తండాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో పనిచేస్తూ గంజాయికి అలవాటుపడ్డాడు. గ్రామానికి వచ్చినప్పుడు తన స్నేహితులకు సైతం ఆ మత్తును అలవాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఈనెల 16న ఆ ముగ్గురిని పట్టుకొని కేసు నమోదు చేశారు.
● లాల్‌సింగ్‌తండావాగు శివారు, గర్జనపల్లి లోని పల్లెప్రకృతివనాలే గంజాయి స్థావరాలు.
● మండలంలోని కంచర్ల శివారులో 2023, అక్టోబర్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద 500 గ్రాముల గంజాయి లభించింది.
పట్టుపడితే కటకటాలే..
నిషేధిత మత్తుపదార్థాలు గంజాయితో పట్టుపడితే కచ్చితంగా కటకటాలకు వెళ్లాల్సిందేనని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలువురు యువకులు పట్టుబడి చేయాలి జైలు జీవితం గడుపుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయాలను గమనించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే గంజాయికి అలవాటు పడి ఉంటే జిల్లా కేంద్రంలోని డీ–ఆడిక్షన్ సెంటర్‌కు పంపించాలని తెలుపుతున్నారు.
యువతపై నిఘా
మండలంలోని అనుమానితులపై నిఘా పెట్టాం. కొందరు యువత చదువుకొని ఉద్యోగ వేటలో ఉంటే.. మరికొందరు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే బాధ్యతలు మర్చిపోతున్నారు. గ్రామాల్లో ఆకతాయిలు అల్లర్లు చేస్తే డయల్ 100కు ఫోన్ చేసి తెలపాలి.
– ఎల్లయ్యగౌడ్, ఎస్సై, వీర్నపల్లి
గమ్మత్తు.. చిత్తు
Comments
Please login to add a commentAdd a comment