కాంగ్రెస్ వైపే పట్టభద్రులు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి/వేములవాడఅర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, వేములవాడఅర్బన్ మండలాల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించి, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ 14 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా రాష్ట్రంలో స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ చందుర్తి మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, వేములవాడ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు బొజ్జ మల్లేశం, నాగం కుమార్, పుల్కం రాజు, కనికరపు రాకేశ్, పిల్లి కనకయ్య, సాగరం వెంకటస్వామి, అజయ్ పాల్గొన్నారు.
ముమ్మర పారిశుధ్య పనులు
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో గురువారం మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో పారిశుధ్య సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మహాశివరాత్రి ఉత్సవాలు మొదలైన 25వ తేదీ నుంచే మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు కేటాయించారు. ఉత్సవాల సమయంలో పట్టణంలో పరిశుభ్రతను కాపాడిన సిబ్బంది.. అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు తరలిరావడంతో పట్టణంలో చాలా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గుడి చెరువు ప్రాంతం, జాతరగ్రౌండ్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. బద్దిపోచమ్మగుడి, భీమన్నగుడి, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఎత్తి ట్రాక్టర్ల ద్వారా డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది పనితీరుని మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ గురువారం పరిశీలించారు.
రాజన్న సేవలో డీఈవో
వేములవాడ: జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రావు గురువారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. స్వామి వారి దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో బ్రాహ్మణులు ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందజేశారు. డీఈవో వెంట మధు మహేశ్, మందిరం రఘు, పోగుల ధనుంజయ్ పాల్గొన్నారు.
కుక్కల హల్‌చల్
● 22 మందిపై దాడి
వేములవాడ: వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దారిన వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలకు వెళ్తున్న మహిళలు, వృద్ధులు, చిన్నారులపై దాడులు చేశాయి. బుధవారం ఒకే రోజు 22 మందిని కరిచినట్లు కాలనీవాసి హన్మండ్లు తెలిపారు. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. కుక్కల బారి నుంచి రక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
కాంగ్రెస్ వైపే పట్టభద్రులు
Comments
Please login to add a commentAdd a comment