
అడవికి ఆపద
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆకురాలే కాలంలో అడవులకు ఆపద పొంచి ఉంది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంటే పచ్చని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఫైర్‌లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కూలీలను నియమించుకొని పనులు చేపట్టేవారు. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఫైర్‌లైన్ల పనులు మొదలుకాలేవు. ఇప్పటికే జిల్లాలోని అటవీ లో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 180 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పనులు ముందుకుసాగలేవు. నిధుల లేమితో ఈ వేసవిలో ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అడవికి గడ్డుకాలమే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
27 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం
జిల్లాలోని 27 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో అత్యధికంగా అడవి విస్తరించి ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో వన్యప్రాణులు ఆవాసాలుగా చేసుకుని జీవనం సాగిస్తుంటాయి. ముఖ్యంగా దుప్పులు, చిరుతపులులు, అడవి పందులు, కుందేళ్లు, జింకలు, మనుబోతులు, ముళ్లపందులతోపాటు నెమళ్లు వంటి అరుదైన జీవజాతులు సంచరిస్తుంటాయి. ఈక్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే రోడ్ల వెంట ప్రయాణించే ఆకతాయిలతోపాటు అడవిలో పశువులు, గొర్రెలకాపరులు చుట్ట తాగుతున్న క్రమంలో దాని నుంచి నిప్పు రవ్వలు పడి అడవులు దహించుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆకతాయిలైతే ఏకంగా అటవీకి నిప్పు పెట్టగా, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి విలువైన వృక్ష సంపదకు ఆపరా నష్టం కలుగుతోంది. ఈక్రమంలో అడవిలో ఊహించని నష్టం జరుగకుండా అధికారులు ముందుగానే ఫైర్‌లైన్‌లను ఏర్పాటు చేస్తే మంటలను విస్తరించకుండా కట్టడి చేసే అవకాశాలున్నాయి.
లక్ష్యం ఇదే..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌ల పరిధిలో 12 సెక్షన్‌లు, 44 బీట్‌లలో కలిపి 27 హెక్టార్‌ల అటవీ ఉంది. జిల్లా అడవి జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని అడవులతో కలసి ఉంటాయి. ఇవన్నీ ప్రధానంగా ఆకురాల్చే అడవులు కావడంతో వేసవిలో మంటలు చెలరేగకుండా ఏటా వేసవిలో ఫైర్‌లైన్లను ఏర్పాటు చేస్తుంటారు. డబ్బా ఆకారంలో 100 మీటర్ల చొప్పున ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మంటలు అంటుకున్న అక్కడికే పరిమితమై అడవికి వ్యాప్తి చెందకుండా ఫైర్‌లైన్లు నిరోధిస్తాయి.
ఈచిత్రంలో వీర్నపల్లి మండలం కంచర్ల శివారులో అడవికి మంటలు వ్యాపించి విలువైన చెట్లు కాలిపోతున్నాయి. ముందస్తుగా అధికారులు ఫైర్‌లైన్లను ఏర్పాటు చేయకపోవడంతోనే ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో అడవిలో ఏర్పాటు చేసే ఫైర్‌లైన్లతో రక్షణ ఉండేది. వేసవి ప్రారంభమైనప్పటికీ నిధుల లేమితో ఈసారి అధికారులు ఫైర్‌లైన్లను ఏర్పాటు చేయలేకపోయారు. నిధులు ఉంటే కూలీలను నియమించుకొని ఫైర్‌లైన్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించి చేతులు దులుపుకుంటున్నారు.
నిధులు కేటాయించలేదు
జిల్లాలో రెండు రేంజ్‌ల పరిధిలో 27 హెక్టార్‌లకు పైగా అడవి విస్తరించి ఉంది. అడవులకు నష్టం జరగకుండా ఫైర్‌లైన్‌లను ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో పనులు మొదలుపెట్టలేదు. ఇప్పటి వరకు నిధులు రాని కారణంగా గ్రామీణులకు అడవుల రక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. మంటలు వ్యాపిస్తే తమకు సమాచారం అందించాలి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఫైర్‌లైన్లు ఏర్పాటు చేస్తాం.
– శ్రీహరి ప్రసాద్, ఎఫ్‌ఆర్వో, సిరిసిల్ల

అడవికి ఆపద
Comments
Please login to add a commentAdd a comment